భారత మహిళా క్రికెట్ టీం ఓడినా గెలిచారు

- July 24, 2017 , by Maagulf
భారత మహిళా క్రికెట్ టీం ఓడినా గెలిచారు

క్రికెట్ మక్కాలో చివరి పంచ్‌ ఇంగ్లాండ్‌దే... చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ విజయం ముంగిట చతికిలపడింది. గెలిచే స్టేజ్‌ నుంచే ఒత్తిడికి లోనై పరాజయం పాలైంది. బౌలర్లు అద్భుతంగా రాణించినా.. చివర్లో బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ప్రపంచకప్‌ చేజారింది. బంతి బంతికీ టెన్షన్‌.. నరాలు తెగే ఉత్కంఠ... అభిమానులను మునివేళ్ళపై నిలబెట్టిన మహిళల ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌.. విజయం కోసం ఇరు జట్లూ అద్భుతంగా పోరాడిన వేళ అభిమానులు అసలైన క్రికెట్ మజాను ఆస్వాదించారు. విజయం ముంగిట భారత్ బోల్తాపడితే... సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ హ్యాట్రిక్ టైటిల్ కొట్టింది. టోర్నీ ఆరంభం నుంచీ అద్భుతంగా ఆడుతోన్న మిథాలీసేన ఫైనల్లోనూ తమ జోరు కొనసాగించింది. ఈ టోర్నీలో ఎక్కువసార్లు భారీస్కోర్ సాధించిన ఇంగ్లీష్ టీమ్‌ను 228 పరుగులకే కట్టడి చేశారు. వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి అత్యుత్తమ గణాంకాల ముందు ఇంగ్లాండ్ బ్యాటింగ్ నిలవలేకపోయింది. అయితే చివర్లో సీవర్, బ్రంట్ పోరాడడంతో స్కోర్ 200 దాటింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన గోస్వామి 23 పరుగులకు 3 వికెట్లు పడగొట్టింది. ఛేజింగ్‌లో భారత్ త్వరగానే ఓపెనర్ మందన , కెప్టెన్ మిథాలీరాజ్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్‌కౌర్ ఆదుకున్నారు. నిలకడగా ఆడుతూ మూడో వికెట్‌కు కీలకపార్టనర్‌షిప్ నమోదు చేయడంతో విజయం ఖాయమనిపించింది. కౌర్ ఔటైనా... పూనమ్ జోరుతో తొలిసారి ప్రపంచకప్ అందుకోవడం గ్యారెంటీ అనుకున్నారు. అయితే స్లాగ్ ఓవర్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. డాట్ బాల్స్‌తో భారత్‌పై ఒత్తిడి పెంచి సక్సెసయ్యారు. ఇక్కడ ఒత్తిడికి లోనైన మన క్రికెటర్లు వికెట్లు పారేసుకోవడంతో ఇంగ్లాండ్ నాలుగోసారి కప్ అందుకుంది. టైటిల్ పోరులో ఓడినప్పటకీ... ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన అందరి ప్రశంసలూ అందుకుంది. తొలి మ్యాచ్ నుంచే స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ప్రపంచకప్ గెలవకున్నా... అద్భుత ప్రదర్శనతో కోట్లాదిమంది అభిమానుల మనసు గెలుచుకున్న మిథాలీసేనపై ప్రధాని నుంచి సామాన్య అభిమాని వరకూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com