నవరసాలు పలికించే ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ

- July 26, 2017 , by Maagulf
నవరసాలు పలికించే ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ

వెండితెరపై నవరసాలను పలికించగల ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ అని మాజీ గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య అన్నారు. యువకళావాహిని ఆధ్వర్యంలో సినీ నటులు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కైకాల సత్యనారాయణ దంపతులకు బంజారాహిల్స్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో సహస్రపూర్ణ చంద్రదర్శన సన్మానం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్య మాట్లాడుతూ ఎలాంటి పాత్రలోనైనా జీవించగల సమర్థులు కైకాల అని అన్నారు. విశిష్ట అతిథి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కళాకారులను ప్రభుత్వాలు గుర్తించకపోయినా ప్రజలు వారికి తగిన ప్రాధాన్యమిచ్చి సన్మానించాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. కళాకారులు లక్షల మందికి ఆనందాన్ని పంచుతారన్నారు. అప్పట్లో నటుడే కీలకంగా వ్యవహరించే వాడని.. ఇప్పుడు గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు. కైకాల సత్యనారాయణ లాంటి నటులను సత్కరించుకోవడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు.
సీనియర్‌ నటి జమున మాట్లాడుతూ కైకాల అప్పటి తరంలో ఎన్‌టిఆర్‌తో ధీటుగా నటించగలిగారని గుర్తు చేశారు. నటనలో ఆయనకు ఆయనే సాటి అని తెలిపారు. సీనియర్‌ దర్శకులు రేలంగి నర్సింహారావు మాట్లాడుతూ నటుడిగానే కాకుండా దర్శక నిర్మాతల హితం కోరే వ్యక్తిత్వం కేవలం కైకాలకే సొంతమన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సారిపల్లి కొండలరావు వ్యవహరించగా సీనియర్‌ నటులు గీతాంజలి, కవిత, గజల్‌ శ్రీనివాస్‌, సీనియర్‌ దర్శకులు కోదండరాంరెడ్డి, గాయని శారద ఆకునూరి, సామాజిక వేత్త కొత్త కృష్ణవేణి పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com