తెలంగాణ వాసికి ఎడారి దారిలో ఆగని కన్నీళ్లు

- August 07, 2017 , by Maagulf
తెలంగాణ వాసికి ఎడారి దారిలో ఆగని కన్నీళ్లు

గల్ఫ్‌లో ఒంటెల కాపరిగా నగరవాసి యాతన 
ఎడారి దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వారి కష్టాల కన్నీళ్లు ఆగడంలేదు. రోజుకో బాధితుడి వ్యథ వెలుగు చూస్తోంది. పాతనగరంలోని తాలాబ్‌ చంచలం డివిజన్‌ ఆమన్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ సాదిక్‌ సౌదీ అరేబియాలో పడుతున్న ఇబ్బందులపై కుటుంబ సభ్యులు సోమవారం ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అతడిని ఎలాగైనా కాపాడి స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. సాదిక్‌ గత ఏడాది జూన్‌ 24న సౌదీ వెళ్లాడు. అక్కడి రియాద్‌ నగరంలో ఓ వ్యక్తి వద్ద సహాయకుడిగా ఉద్యోగం ఉందని వెళ్లేముందు ఏజెంటు చెప్పాడు. కానీ అక్కడికి వెళ్లాక యజమాని మాత్రం జనావాసాలకు దూరంగా ఎడారి ప్రాంతంలో ఒంటెల కాపరిగా పంపించడంతో అతడి పరిస్థితి దారుణంగా మారింది. మండుటెండల్లో మాడిపోతూ... 11 నెలలుగా వేతనాలు లేక తీవ్ర దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్‌ బాధితుని వివరాలను విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్విట్టర్‌లో పంపించారు.
అతడిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎడారి ప్రాంతంలో సాదిక్‌ను మాసినగడ్డం, కమిలిపోయిన చర్మంతో దయనీయ స్థితిలో చూసిన కొందరు హైదరాబాద్‌ వాసులు అతని చిత్రాలను కుటుంబ సభ్యులకు పంపించడంతో ఈ విషయం వెలుగు చూసింది. అమ్జదుల్లాఖాన్‌ ఈ చిత్రాలనూ కేంద్రమంత్రికి పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com