పాకిస్థాన్‌లో విస్తరిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐ.ఎస్‌.)

- August 07, 2017 , by Maagulf
పాకిస్థాన్‌లో విస్తరిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐ.ఎస్‌.)

పాకిస్థాన్‌లో ఇప్పటికే ఉన్న పలు ఉగ్రవాద ముఠాలతో పాటు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐ.ఎస్‌.) కూడా విస్తరిస్తోందా? ఆత్మాహతి దాడికి పాల్పడుతూ చివరి నిమిషంలో పోలీసులకు చిక్కిన ఉస్మాన్‌ అనే 18 ఏళ్ల యువకుడు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు ఐఎస్‌ విస్తరణను గుర్తించారు. 'మధ్య ప్రాచ్యంలో ఉన్నట్టుగా ఐ.ఎస్‌.కు ఇక్కడ పార్టీ యంత్రాంగం లేదు. ఓ ప్రచార ఉద్యమంలా పనిచేస్తోంది. పాకిస్థాన్‌కు ఈ విధానమే సరైనదని భావిస్తోంద'ని ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధికారి రాజా ఉమర్‌ ఖట్టాబ్‌ చెప్పారు. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న అభిమానుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
కుటుంబమంతా జిహాద్‌తో సంబంధం ఉన్నవారే: ఉస్మాన్‌ వాస్తవంగా పాకిస్థాన్‌లోని స్వాత్‌ లోయకు చెందిన వాడు. ఆయన తండ్రి పాకిస్థానీ తాలిబన్‌లో పనిచేశాడు. డ్రోన్‌ దాడిలో చనిపోవడంతో ఆయన కుంటుంబం అఫ్గానిస్థాన్‌లోని నంగర్‌హార్‌కు వెళ్లింది. అక్కడే ఉగ్రవాద ముఠాల్లో చేరాడు. గత సెప్టెంబరులో పాక్‌ పోలీసులకు చిక్కాడు. విచారణలో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడించాడు. 'ఒక సారి మా ఇంటికి ఓ వృద్ధుడు వచ్చి మా అన్నయ్యతో మాట్లాడాడు. జిహాద్‌లో చేరాలని నాకు మా అన్నయ్య చెప్పాడు. ఆత్మాహుతి దళంగా మారాలని అన్నాడు. మరుసటి రోజున ఆ వృద్ధునితో కలిసి కాందహార్‌ వెళ్లాను. అక్కడ నుంచి సరిహద్దులు దాటి పాక్‌లోని బలూచిస్థాన్‌కు వెళ్లాం. దక్షిణ బలూచిస్థాన్‌లో ఎడారిలో ఉన్న వాధ్‌ పట్టణానికి మోటారు సైకిల్‌పై తీసుకెళ్లారు. అక్కడ మాజ్‌ అనే వ్యక్తి ఇంట్లో ఉండి శిక్షణ పొందాను. అతడే పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి సభ్యులు ధరించే రెండు జాకెట్లు తయారు చేశాడు' అని చెప్పాడు.
భాష తెలియక దొరికిపోయాడు: నెల రోజుల శిక్షణ తరువాత ఉస్మాన్‌ను ఒక వ్యక్తిని తోడుగా ఇచ్చి మోటారు సైకిల్‌పై దాదాపు 250 కి.మీ.దూరంలో ఉన్న శిఖర్‌పూర్‌కు పంపించారు. షియా ముస్లింలు ప్రార్థన చేస్తున్నప్పుడు పేలుడు పదార్థాలు ప్రయోగించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రార్థన సమయంలో స్థానికుడు ఒకరు స్థానిక సింధీ భాషలో అతడిని ఏదో అడిగాడు. భాష రాక సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చింది. చుట్టూ ఉన్నవారు కూడా పోగయ్యారు. ఉస్మాన్‌ గ్రేనేడ్‌ను పట్టుకోకముందే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం గత మార్చిలో న్యాయస్థానం శిక్ష విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com