చాల రోజులు తరువాత కొడుకు సినిమాలో తండ్రి

- August 10, 2017 , by Maagulf
చాల రోజులు తరువాత కొడుకు సినిమాలో తండ్రి

సూపర్‌స్టార్‌ కృష్ణ.. 'కొడుకు దిద్దిన కాపురం', 'ముగ్గురు కొడుకులు' 'గూఢాచారి 117' తదితర చిత్రాల్లో తన కుమారుడు ప్రిన్స్‌ మహేశ్‌బాబుతో కలిసి నటించారు. ఆ తర్వాత మహేశ్‌ కథానాయకుడిగా నటించిన 'రాజకుమారుడు', 'వంశీ', 'టక్కరి దొంగ' చిత్రాల్లో కృష్ణ అతిథి పాత్రల్లో కన్పించారు.
అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ తండ్రీకొడుకులు తెరపై కనువిందు చేయనున్నట్లు చిత్రవర్గాల సమాచారం. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'భరత్‌ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అడ్వాణీ కథానాయిక. ఇందులో కృష్ణ కీలక పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అదే నిజమైతే మళ్లీ ఈ తండ్రీకొడుకులను తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు పండుగే.
అంతేకాదు.. ఈ సినిమాలో చాలా మంది సీనియర్‌ నటులు కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండడం విశేషం.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క మహేశ్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో వస్తున్న 'స్పైడర్‌' చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com