హైదరాబాద్ పాతబస్తీలో అరబ్‌షేక్‌తో బాలికకు పెళ్లి
- August 17, 2017
రూ.5 లక్షలు తీసుకొని పెళ్లిచేసేసిన మేనత్త
హైదరాబాద్ పాతబస్తీలో అమ్మాయిలు అరబ్‌షేకుల దాష్టీకానికి బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ బాలికను వృద్ధుడైన అరబ్‌షేక్‌కు ఇచ్చి పెళ్లి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. దేశం కాని దేశంలో తన కుమార్తె పడుతున్న కష్టాలు తెలుసుకున్న తల్లి ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన సయ్యద్ అఫ్సర్, సయీదున్నీసా దంపతులకు రౌక్సర్(16), సయ్యద్ ఇమ్రాన్(13) పిల్లలున్నారు. తీగెలకుంటలో నివసించే అఫ్సర్ సోదరి గౌసియాబేగం, ఆమె భర్త సికిందర్, అతని స్నేహితుడు హాజీలు మాయమాటలతో పేదరికంలో మగ్గుతున్న అఫ్సర్ కుటుంబాన్ని మభ్యపెట్టారు. అరబ్‌షేక్‌తో రౌక్సర్‌కు పెళ్లి చేస్తే కష్టాలు తీరతాయని నమ్మించారు. బాలిక తల్లి ఇందుకు అంగీకరించకపోవడంతో గౌసియాబేగం, సికిందర్‌లు బాలికకు దుబాయ్ వీడియోలు చూపించి మభ్యపెట్టారు. బాలికను ఒప్పించి ఒమన్‌కు చెందిన అహ్మద్(65)తో పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో బాలిక తల్లిదండ్రులకు అరబ్‌షేక్ ఆక్టివా వాహనం, కూలర్, సెల్‌ఫోన్ ఇచ్చాడు. పెళ్లయిన తర్వాత నాలుగు రోజుల పాటు అరబ్‌షేక్ బార్కాస్‌లోని ఓ లాడ్జీలో బాలికతో గడిపాడు. అనంతరం బాలికను సికిందర్, గౌసియాలు మస్కట్‌కు పంపారు. కొద్ది రోజుల తర్వాత బాలికకు తల్లిదండ్రులు ఫోన్ చేయగా.. అరబ్‌షేక్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, తనను ఇంటికి తీసుకెళ్లాలని ఏడుస్తూ చెప్పింది. తమ కూతురిని రప్పించాలని అఫ్సర్ దంపతులు సికిందర్, గౌసియాలను కోరగా వారు తిరస్కరించారు. దీంతో సయీదున్నీసా నేరుగా అరబ్‌షేక్‌కు ఫోన్ చేసి తన కుమార్తెను పంపించమని అడగ్గా.. తాను సికిందర్, గౌసియాలకు రూ.5 లక్షలు ఇచ్చానని, ఆ సొమ్ము తిరిగిస్తే బాలికను పంపిస్తానని చెప్పాడు. సికిందర్, గౌసియాలను నిలదీసిన బాలిక తల్లిదండ్రులు ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికిందర్, గౌసియాబేగం, ఒమన్ దేశస్థుడు అహ్మద్, హాజీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను రప్పించండి సుష్మాను కోరిన మేనక అరబ్‌షేక్ చెర నుంచి హైదరాబాద్ బాలికను విడిపించి తల్లిదండ్రులకు వద్దకు చేర్చాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. బాలిక దీనస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో మేనక ట్విట్టర్‌లో స్పందించారు. బాలికను హైదరాబాద్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సుష్మా స్వరాజ్‌ను కోరారు. బలవంతపు పెళ్లికి కారకులెవరో గుర్తించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు సూచించారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







