ముంబయిలో ఘోరం భవనం కూలి 10 మంది మృతి

- August 31, 2017 , by Maagulf
ముంబయిలో ఘోరం భవనం కూలి 10 మంది మృతి

ఓ వైపు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భిండి బజార్‌ ప్రాంతంలో గురువారం ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది సహా 15 మంది గాయపడగా.. మరో 25 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఉదయం 8.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భవనంలో తొమ్మిది కుటుంబాలు నివసిస్తున్నాయని అగ్నిమాపక విభాగ అధికారులు తెలిపారు. భవనంలో ఓ ప్లేస్కూల్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉదయమే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ భవనం 50ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతున్నారు.
 కాగా.. ముంబయిలో మంగళవారం భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో వరదలు సంభవించి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా ముంబయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com