అంతర్జాతీయ సర్వీసులకు తొలి అడుగు వేస్తున్న స్కూట్‌ ఎయిర్‌వేస్‌

- August 31, 2017 , by Maagulf
అంతర్జాతీయ సర్వీసులకు తొలి అడుగు వేస్తున్న స్కూట్‌ ఎయిర్‌వేస్‌

అమరావతి రాజధానికి తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టులో ఒకవైపు అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ ముస్తాబవుతుంటే .. మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసులకు మార్గం సుగమం అవుతోంది. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత విదేశాలకు విమాన సర్వీసులు తిరగటానికి అవసరమైన కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ శాఖల ఏర్పాటుకు చకచకా పనులు జరుగుతుండగా, విదేశాలకు విమాన సర్వీసులు తిప్పటానికి సింగపూర్‌, గల్ఫ్‌ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. సింగపూర్‌కు చెందిన ప్రైవేటు విమానయాన సంస్థ ‘స్కూట్‌ ఎయిర్‌వేస్‌’ నేరుగా విజయవాడకు సర్వీసు నడపటానికి రాష్ట్రప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు గతంలో సింగపూర్‌ వెళ్లినపుడు అక్కడి నుంచి విమాన సర్వీసులు నడపటానికి ఉన్న అవకాశాల మీద చర్చించారు. సింగపూర్‌లో ఉన్న స్థానిక విమానయాన సంస్థలకు ఏపీలోని నూతన రాజధానిలోని విజయవాడ విమానాశ్రయానికి ఉన్న వనరులు, అవకాశాలకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో సింగపూర్‌కు చెందిన స్కూట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ తాజాగా సర్వీసును నడపటానికి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. సీఎంవో కార్యాలయ స్థాయిలో ప్రస్తుతం ఈ విమాన సర్వీసు రాకకు సంబంధించి ఉత్తర ప్రత్తుత్తర ప్రక్రియ జరుగుతోంది. ఇంకా విజయవాడ ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో ఈ సంస్థ సంప్రదింపులు జరపలేదు. త్వరలోనే ఈ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)లతో సంప్రదింపులు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు అధికారులతో కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు సమావేశమయ్యేది వివరాలు తెలియాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో స్కూట్‌ ఎయిర్‌వేస్‌ సంప్రదింపులు జరపటానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటికప్పుడు విమాన సర్వీసు నడిపితే ప్రయాణికులు ఆస్థాయిలో లేకపోతే నష్టపోతామన్న భావనతో ప్రభుత్వం నుంచి తగిన గ్యారంటీని ఈ సంస్థ కోరుతున్నట్టు సమాచారం. ప్రాంతీయ కనెక్టివిటీలో భాగంగా తిరుపతి, కడప, హైదరాబాద్‌లకు సర్వీసులు నడుపుతున్న దేశీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌కు రాష్ట్రప్రభుత్వం మినిమం గ్యారంటీ ఇస్తోంది. ఆ స్థాయిలో సీట్లు బుక్‌ కాకపోతే గ్యారంటీ ఇచ్చిన సీట్ల వరకు తిరిగి ఆ సంస్థకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేస్తోంది. ఇదే తరహాలో సింగపూర్‌కు చెందిన స్కూట్‌ ఎయిర్‌వేస్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ ప్రభుత్వ స్థాయిలో ఉండటం వల్ల ఇంకా ఒక కొలిక్కి రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గల్ఫ్‌దేశమైన అరబ్‌ ఎమిరేట్స్‌కు కూడా విమాన సర్వీసు నడటానికి మార్గం సుగమం అవుతోంది. కేంద్రప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అరబ్‌ ఎమిరేట్స్‌తో కేంద్రప్రభుత్వ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఆ దేశానికి సంస్థ ఆసక్తి చూపిస్తోంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ప్రత్యేకంగా తీసుకుని అరబ్‌ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు సింగపూర్‌, అటు అరబ్‌ ఎమిరేట్స్‌కు విమానాలు ఏకకాలంలో ప్రారంభమైతే.. దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు విమానాలు నడుస్తున్నట్టు అవుతుంది.
చెన్నైకు ఎయిర్‌ ఇండియా విమానం
ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నైకు నూతన సర్వీసును సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించబోతోంది. ఇప్పటి వరకు ఉదయం, సాయంత్రాలలోనే చెన్నైకు విజయవాడ నుంచి విమానాలు ఉన్నాయి. ఎయిర్‌ ఇండియా సర్వీసుతో మధ్యాహ్నం కూడా ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసు ప్రారంభం అవుతుంది. చెన్నై నుంచి ఉదయం 10.55 గంటలకు విజయవాడ బయలు దేరుతుంది. విజయవాడకు మధ్యాహ్నం 12.25 కల్లా చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి 12.35కు సర్వీసు బయలు దేరుతుంది. చెన్నైకు 1.55 కల్లా చేరుకుంటుంది. ప్రతి రోజూ ఈ విమాన సర్వీసు నడుస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com