రేపే కాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి

- September 01, 2017 , by Maagulf
రేపే కాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి

కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.. ఈ దఫాలో తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దత్తాత్రేయ రాజీనామా చేయగా.. ఆ స్థానాన్ని ఇక్కడ్నుంచే భర్తీ చేయొచ్చని సమాచారం. ఇక ఏపీలోనూ శాఖల మార్పులు కనబడుతుంటే, కొత్త ముఖాలకు సెంట్రల్‌ కేబినెట్‌లో అవకాశం ఉన్నట్లు హస్తిన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆదివారం జరిగే కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి దత్తాత్రేయ, ఏపీ నుంచి అశోక్‌గజపాతి రాజు, సుజనా చౌదరి, సురేశ్‌ ప్రభు ప్రాతినిధ్యం వహిస్తుండగా వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా తెలుగు వారి కోటా కిందే పరిగణించబడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరి శాఖల్లో సమూల మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ నుంచి బీజేపీకి ఏకైక ప్రతినిధిగా ఉన్న బండారు దత్తాత్రేయను రాజీనామా సమర్పించాల్సిందిగా ప్రధాని కోరడంతో గురువారం సాయంత్రమే ఆయన ఢిల్లీ చేరుకుని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను కలిశారు. భవిష్యత్తులో గౌరవ ప్రదమైన హోదా కల్పిస్తామని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా హామీ ఇచ్చినట్లు సమాచారం. వెంటనే ఆయన రాజీనామా సమర్పించి హైదరాబాద్ వచ్చేశారు. ముందుగా అనుకున్న జాబితాలో దత్తాత్రేయ పేరు ఎక్కడా వినిపించనప్పటికీ రాత్రికి రాత్రే ఆయన చేత రాజీనామా చేయించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే దత్తాత్రేయను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌ను చేస్తారని తెలుస్తోంది. ఈ స్థానాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుతో భర్తీ చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మురళీధర్‌రావు ప్రస్తుతం తమిళనాడు బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అధిష్ఠానం ఆదేశాలతో ఆయన ఢిల్లీ వెళ్లారు. అయితే మురళీధర్‌రావుతోపాటు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి పేర్లు కూడా కేబినెట్‌ పరిశీనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఢిల్లీ పర్యటనకు రావడంతో ఎన్డీయేలో టీఆర్‌ఎస్‌ కూడా భాగస్వామి కానుందా అన్న ఊహాగానాలు హస్తినలో జోరందుకున్నాయి.
ఇక ఏపీ విషయానికొస్తే మొన్నటి వరకు సీనియర్‌ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడంతో రాష్ట్రంలో బీజేపీ పాత్ర మరింత పెంచేందుకు ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు లేదా గోకరాజు గంగరాజులో ఒకరికి సహాయ మంత్రి పదవి దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక నిర్మలా సీతారామన్‌కు ఇప్పటికే గుజరాత్‌ ఎన్నికల బాధ్యతలు అప్పగించగా... దానికి అదనంగా పార్టీ అధికార ప్రతినిధి పదవి ఇవ్వొచ్చని చర్చ జరుగుతోంది. అయితే పనితీరు రీత్యా నిర్మలా సీతారామన్‌కు పదోన్నతి కూడా లభించే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. తమకు మరో సహాయ మంత్రి పదవి కావాలని చాలా కాలంగా కోరుతోంది. అయితే ఈ విస్తరణలో టీడీపీకి ఛాన్స్‌ లేనట్టే తెలుస్తోంది. మరోవైపు అశోక్‌ గజపతిరాజు శాఖలోనూ మార్పు జరగనున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com