బాలికలకు ఉచిత విద్య - కర్ణాటక ప్రభుత్వం

- September 02, 2017 , by Maagulf
బాలికలకు ఉచిత విద్య - కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు సిద్ధమవుతోంది.  ఇందుకు భారీ నిధులతో ఒక ప్రణాళికను కూడా సిద్దం చేసింది.   దీని ప్రకారం ఒకటవ తరగతి  నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేంతవరకు బాలికలు  ఉచితంగా విద్యాభ్యాసం చేసే సౌలభ్యాన్ని కల్పిస్తోంది.  2018-2019 విద్యాసంవత్సరం నుంచి  ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.  దీని ద్వారా సుమారు 18 లక్షలమందికి లబ్ధి  చేకూరనుందని అంచనా.

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో గ్రాడ్యుయేషన్ స్థాయికి రాష్ట్రంలోని మొత్తం బాలికలకు ఉచిత విద్యను అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత‍్వంలోని  కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి రూ.110 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని దాదాపు 18లక్షల మంది  విద్యార్థినులకు ఇది ఉపయోగపడనుందని  రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి  బసవరాజ్‌ రాయరెడ్డి ప్రకటించారు.
అయితే పట్టణ,  గ్రామీణ, ధనిక,  పేద అనే విచక్షణ లేకుండా  అందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది.   ఈ పథకం ప్రకారం ముందుగా ఫీజు చెల్లించి , అనంతరం ప్రభుత్వం నుంచి రీఎంబర్స్‌ చేసుకోవచ్చు.  అయితే పరీక్ష ఫీజును  ఈ పథకంనుంచి మినహాయించారు.  ఈ పథకం అమలులో  గందరగోళం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి, లబ్ధిదారులకు తిరిగి చెల్లించడం మంచిదని  తాము భావించామని  మంత్రి చెప్పారు.
కాగా  వచ్చే ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన  వచ్చినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com