ప్రయోగాత్మకంగా బెజవాడలో అమలు నవంబర్‌ 1 నుంచి

- October 29, 2015 , by Maagulf
ప్రయోగాత్మకంగా బెజవాడలో అమలు నవంబర్‌ 1 నుంచి

ప్రయోగాత్మకంగా బెజవాడలో అమలు నవంబర్‌ 1 నుంచి అమలుకు ఏర్పాట్లు నిర్లక్ష్యానికి, అవినీతికి చెక్‌ మూడు రోజుల్లోనే అఫ్రూవల్స్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌, శిక్షణకు బెంగళూర్‌ 'సాఫ్‌టెక్‌' కంపెనీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పౌరసేవల్ని సరళతరం చేసేందుకు బెజవాడ కార్పొరేషన్‌ ఒడిఒడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ-గవర్నెర్స్‌ను అమలుకు సన్నాహాలు ప్రారంభించిన కార్పొరేషన్‌.. తాజాగా ఆన్‌లైన్‌ ద్వారా బిల్డింగ్‌ అఫ్లికేషన్స్‌ అఫ్రూవల్‌కు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆన్‌లైన్‌ అఫ్లికేషన్‌ పద్ధతిని ప్రయోగాత్మకంగా బెజవాడ కార్పొరేషన్‌లో నవంబర్‌ 1 నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన 'సాఫ్‌టెక్‌' కంపెనీ ప్రతినిధులు సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్‌ చేయటంతో పాటు, ఇంజనీర్స్‌, ప్లానర్స్‌, తదితరులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిర్లక్ష్యానికి, అవినీతికి చెక్‌ ప్రస్తుత రోజుల్లో సొంత స్థలం ఉన్నా, దానిలో ఇల్లు కట్టుకోవాలంటే అనేక నియమ నిబంధనలు అడ్డువస్తున్నాయి. ముఖ్యంగా బెజవాడ కార్పొరేషన్‌లో ఆ నిబంధనలకు పట్టణ ప్రణాళికా విభాగపు అధికార, సిబ్బంది 'బంధనాలు' మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటి ప్లాను కోసం దరఖాస్తులు చేసుకుంటే అవి ఆమోదం పొందకుండా నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. దరఖాస్తులో అన్నీ సక్రమంగా పూర్తిచేసినా అధికారులు ఏదో వంక పెట్టుకుని నిర్మాణదారుల్ని, పదేపదే కార్పొరేషన్‌ చుట్టూ తిప్పించుకుంటున్నారు. బీఓ నెంబర్‌ చెప్పినా సరే, వాటిని ఏమాత్రం వెరిఫై చేయకుండా పక్కనపడేస్తున్నారు. కొన్ని దరఖాస్తులైతే చెత్తబుట్టలో పడేసి, పోయిందని చెబుతున్నారు. దీంతో చేసేది లేక నిర్మాణదారులు మళ్లీ..మళ్లీ దరఖాస్తులు చేసుకుని, కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. ఇలా అఫ్రూవల్‌ కాక బెజవాడ కార్పొరేషన్‌లో కొన్ని వందల ఫైల్స్‌ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఈ దరఖాస్తులన్నీ ఇలా పెండింగ్‌లో ఉండటానికి ప్రధాన కారణం అధికార, సిబ్బందికి లంచాలు ఇవ్వకపోవటమేనని తెలుస్తోంది. సంవత్సరల తరబడి ఈ వ్యవస్థలో ఉన్న ఇటువంటి విధానానికి చెక్‌పెట్టేందుకే ఆన్‌లైన్‌ అఫ్లికేషన్‌ను ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. క్యాడ్‌ ఫార్మెట్‌లో దరఖాస్తుల స్వీకరణ భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలంటే స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌, భవనం నిర్మించబోయే స్థలం పన్ను (లేటెస్ట్‌ వీఎల్‌టీ), రూ. 500 విలువైన మూడు అగ్రిమెంట్స్‌ బాండ్స్‌, నిర్మాణదారుని వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్పటికే భవనం నిర్మించి ఉండి, దానిపై మరో అంతస్తును నిర్మించుకుందామనుకుంటే ఆ భవనం ప్లాను, ట్యాక్స్‌లతో ప్లాను కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. తర్వాత ఈ దరఖాస్తులు గుమస్తాలకు, అక్కడ నుంచి అధికారులకు చేరుతాయి. అధికారులు ఫీల్డ్‌ విజిట్‌ చేసి రిమార్క్స్‌ నోట్‌ చేసి, ఆమోదం తెలుపుతారు. లేదా రిటర్న్‌ చేస్తారు. ఇదంతా జరగటానికి ఎలా లేదన్నా రెండు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. దీంతో నిర్మాణదారుల సమయం, ధనమూ రెండూ అధిక మొత్తంలో వృథా అయిపోతున్నాయి. అయితే ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానానికి శ్రీకారం చుట్టడంతో ఈ కష్టాలన్ని తొలగిపోనున్నాయి. బీపీఎస్‌ మాదిరిగా.. క్యాడ్‌ ఫార్మెట్‌లో ఈ దరఖాస్తుల్ని పెట్టుకోవచ్చు. దీంతో దరఖాస్తుకు చెందిన అన్ని అంశాలు ఆన్‌లైన్‌లో పొందుపరచబడుతాయి. అధికారులు వాటిని వెరిఫై చేసి, వాటిలో కావాల్సిన వివరాల్ని తీసుకుని, ఫీల్డ్‌విజిట్‌ చేసి, రెండు మూడు రోజుల్లోనే దరఖాస్తులకు ఆమోద ముద్రవేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com