అక్కినేని అమల బర్త్ డే స్పెషల్

- September 12, 2017 , by Maagulf
అక్కినేని అమల బర్త్ డే స్పెషల్

పుష్పక విమానంలో విరిసిన కమలం.. 

అమల.. ఎనభై దశకం చివర్లో తెలుగు తెరను మెరిపించిన వెండి వెన్నెల.. ఫస్ట్ మూవీతోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి.. తమిళనాడులో టాప్ హీరోయిన్ గా వెలిగిన మోస్ట్ టాలెంటెడ్. సింగీతం వారి పుష్పక విమానంలో అమలను చూసి తెలుగు ప్రేక్షకులు వావ్ అనేశారు. ఆ తర్వాత తెలుగు టాప్ హీరోలందరితోనూ నటించిన అమల నాగార్జున అర్ధాంగిగా మారాక కెమేరా నుంచి దూరం జరిగారు. ఈ మధ్య కాలంలో.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్  సినిమాలో నటించింది. ప్రస్తుతం మళయాలంలోనూ ఓ సినిమా చేస్తోన్న అమల బర్త్ డే నేడు. 

అమల తండ్రి బెంగాళీ, తల్లి ఐరిష్. అమల ఎర్లీ స్కూలింగు వైజాగ్ లోనే నడిచింది. ఫాదర్ కు చెన్నై ట్రాన్స్ ఫర్ కావడంతో హయ్యర్ స్టడీస్ అక్కడ నడిచాయి. చెన్నై కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకుంటూండగా టి.రాజేందర్ ఆమెను సినిమాల్లోకి తీసుకువచ్చాడు. ఆయన దర్శకత్వంలోనే  మైథిలీ నీ ఎన్నై కాదలితో వెండితెరపై అరంగేట్రం చేసి ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అనిపించుకుంది. ఫస్ట్ మూవీ పెద్ద హిట్. దీంతో అమలకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. 

అమల తెరంగేట్రం చేసిన యేడాదే నాగార్జున కూడా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత యేడాది ఈ ఇద్దరూ కలిసి నటించారు. పుష్పక విమానంతో పాటే మొదలైన ఆ సినిమా కిరాయి దాదా. ఇది కూడా పెద్ద విజయం సాధించడంతో.. తెలుగులోనూ అమలకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. 

నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా శివ. రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ మూవీగా వచ్చిన శివలోనూ అమలే హీరోయిన్. ఈ సినిమా తర్వాతే వీరి ప్రేమబంధం గాఢమై దృఢంగా మారిందంటారు. మామూలుగా కాలేజ్ స్టోరీస్ లో ప్రేమకథలు అక్కడి వరకే పరిమితం అవుతాయి. కానీ శివలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. లవ్ అండ్ మ్యారేజ్ రియల్ లైఫ్ లోనూ జరిగింది.

నాగార్జునతో ఎక్కువ సినిమాలు చేసినా.. తెలుగులో టాప్ స్టార్స్ అందరితోనూ జోడీ కట్టింది అమల. వెంకటేశ్ తో రక్తతిలకంలోనూ, చిరంజీవితో రాజా విక్రమార్కలోనూ, రాజశేఖర్ తో ఆగ్రహంలోనూ చేసింది అమల. చిరంజీవితో స్టెప్స్ వేయడం కొంచెం కష్టమే కానీ అమల తన స్టైల్లో రెచ్చిపోయిందీ సినిమాలో. తెలుగులో నాగ్ తో చేసిన సినిమాల్లో కిరాయిదాదా, శివ, ప్రేమయుద్ధంతో పాటు నిర్ణయం సినిమాలున్నాయి. వీటిలో నిర్ణయం సినిమాలో వీరి మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్.. ఎప్పుడు చూసినా ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆ పాత్రల్లో వాళ్లు అంతలా జీవించేశారు. 

మొత్తంగా నాగార్జునతో ప్రేమ, పెళ్లి తర్వాత గృహిణిగా పూర్తిగా ఇంటిపనులకే పరిమితం కాలేదు అమల. ఖాళీ సమయాలను సొసైటీకి ఉపయోగపడే పనులకు కేటాయించారు. జంతు పరిరక్షణ లక్ష్యంగా బ్లూక్రాస్ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు.. 

నటనకు దూరమైన దాదాపు ఒకటిన్నర దశాబ్ధం తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో రీ ఎంట్రీ ఇచ్చి మనంలో మెరిసి మళ్లీ ఆకట్టుకుంది. నటిగా, గృహిణిగా, అమ్మగా, బ్లూ క్రాస్ సొసైటీ స్థాపకురాలిగా.. ఇలా పలు బాధ్యతల్లో సమర్థవంతమైన పాత్ర పోషిస్తూ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది అమల. ప్రస్తుతం 26యేళ్ల తర్వాత మళ్లీ మళయాలంలో ఓ సినిమాలో నటిస్తోందిపుడు. మంజువారియర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న కేరాఫ్ సైరాభాను  సినిమాలో లాయర్ గా నటిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com