'అక్కినేని' జయంతి స్పెషల్
- September 20, 2017
అక్కినేని ఎక్కలేని ఎత్తుల్లేవు...అక్కినేని తొక్కలేని స్టెప్పుల్లేవు...అక్కినేని చేయలేని పాత్రల్లేవు...ఇలా అక్కినేని దండకం రాశారో సందర్భంలో ముళ్లపూడి. అది అక్షరసత్యం. ఏ పాత్రకైనా ఇట్టే ఇమిడిపోయే మనిషి కాకపోయినా...పాత్రను అధ్యయనం చేసి ఏ పాత్రనైనా రక్తి కట్టించగల నట పరిశోధకుడు అక్కినేని. అదే ఆయన సక్సెస్ మంత్రం. ఇవాళ నటసామ్రాట్ జయంతి..
ఏఎన్నార్ ఎంట్రీ ఇచ్చింది పౌరాణికంతోనే అయినా...ఆ తర్వాత చేసినవి వరసగా జానపదాలు. అప్పటికి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా తెలుగు సినిమాగా ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నారు అక్కినేని. ఆ తర్వాత సోషల్ హీరోగా కొత్త స్టైల్ తో ఛార్మ్ తో మెరిసారు. ముఖ్యంగా అక్కినేని చూపులు చురకత్తుల్లా ఉండేవి. ఆయన గ్లామర్ రహస్యం ఆ చూపులే అని ముక్తకంఠంతో తేల్చేసింది ఇండస్ట్రీ.
బాలనటుడుగా ధర్మపత్నిలో తెరంగేట్రం చేశారు అక్కినేని. కొంత గ్యాప్ తర్వాత యవ్వన ప్రారంభంలో సీతారామజననంలో శ్రీరాముడుగా చేసిన అక్కినేని ఆ తర్వాత జానపద నాయకుడుగా కత్తిదూసి తెలుగు తెర తొలి సూపర్ స్టార్ అయ్యారు. వరసగా బాలరాజు, ముగ్గురు మరాఠీలు, కీలుగుర్రం చిత్రాలతో అక్కినేనికి తిరుగులేదనిపించారు.
నాగేశ్వరరావు అందగాడు కాదు…నాగేశ్వరరావుకు మంచి కళ్ళు లేవు. కంఠం అంత కన్నా లేదు. ఒడ్డూ పొడుగూ విగ్రహం లేదు. బాషా పాండిత్యం లేదు. ఇంతెందుకు నటుడికి కావలసిన లక్షణాలు అసలు లేవు. అయినా-హీరో అయ్యాడు…ఇప్పటికీ హీరోగా ఉన్నాడు..ఇంకా ఉంటాడు...ఇవి ఆత్రేయ అక్కినేని గురించి చెప్పిన మాటలు.
ఏఎన్నార్ కన్నా ఎన్టీఆర్ వయసులో పెద్దవారు. చదువు, పర్సనాల్టీ వాయిస్ లాంటి విషయాల్లో అయితే అసలు పోలికే లేదు. అయినా అక్కినేని జంకలేదు. తన మీద తనకు అపారమైన నమ్మకం. అంతటి ఎన్టీఆర్ కు గట్టిపోటీ ఇచ్చారు. నవలా చిత్రాల కథానాయకుడుగా మహిళా ప్రేక్షకుల మనసుల్లో కొలువుతీరాడు. క్లాస్ హీరో అనిపించుకున్నాడు.
అక్కినేనికి ముందు చూపు ఎక్కువ. తనను తాను కొత్త తరహా పాత్రల్లో ప్రేక్షకులకు పరిచయం చేసుకోడానికి సొంత నిర్మాణ సంస్ధ ఉండడం శ్రేయస్కరం అనుకున్నారు. అంతే తను ఛైర్మన్ గా గురువు దుక్కిపాటి మధుసూధనరావు మేనేజింగ్ డైరక్టర్ గా, డిస్ట్రిబ్యూటర్ కాట్రగడ్డ శ్రీనివాసరావు తదితరులు డైరక్టర్లుగా అన్నపూర్ణ పిక్చర్స్ అనే బ్యానర్ ప్రారంభించి కె.వి.రెడ్డితో దొంగరాముడు తీశారు.
తనదైన పంథాలో కొనసాగుతూనే...ఎన్టీఆర్ తో కలసి సుమారు పద్నాలుగు సినిమాల్లో నటించారు. వాటిలో పౌరాణికాల సంఖ్యే అధికం. కేవలం తన నటనతోనే ఎన్టీఆర్ తో పోటీ పడేవారాయన. మాయాబజార్ లో అభిమన్యుడుగా గ్లామర్ ఒలికిస్తారు. శ్రీ కృష్ణార్జున యుద్దంలో అర్జునుడుగా ఎన్టీఆర్ ను ఢీకొంటారు. భూకైలాస్ సినిమాలో నారదుడి పాత్రలో ఎన్టీఆర్ ను ముప్పతిప్పలు పెడతారు.
ప్రేక్షకుల ఆలోచనల్లోనూ, అభిరుచుల్లోనూ వస్తున్న మార్పులను చాలా జాగ్రత్తగా గమనించేవారు అక్కినేని. తనను తాను మౌల్డ్ చేసుకునేవారు. ఈ క్రమంలో భాగంగానే...ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఏ పనిచేసినా కృషే. ప్రేక్షకులకు కొత్త నాగేశ్వరరావును పరిచయం చేయడం కోసం కొత్త దర్శకులతో సినిమాలు చేసేవారు. ఆ ప్రయత్నంలో భాగంగానే విశ్వనాథ్ తో ఆత్మగౌరవం తీస్తే...బాపు బుద్దిమంతుడుగా ద్విపాత్రాభినయం చేయించారు.
హీరోగా స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనకాడలేదు అక్కినేని. అందులో తెలుగువారి మదిలో ఎప్పటికీ నిలిచిపోయే మిస్సమ్మ ఒకటి. డిటెక్టివ్ నంటూ తెగ హడావిడీ చేస్తూ సాగే ఆయన నటన కడుపుబ్బా నవ్విస్తుంది. ఎన్టీఆర్ తో పాటుగా తన నటనతో ఆ పాత్రను మరింత ఉన్నతంగా నిలబెట్టారు.
ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించే ప్రయత్నంలో భాగంగానే...తెలుగు తెరకు డాన్సులు పరిచయం చేశారు. దసరాబుల్లోడు కు ముందు తెలుగు సినిమా హీరో పెద్దగా డాన్సులు చేసేవాడు కాదు. ఆయన పాడుతూ ఉంటే హీరోయిన్ డాన్స్ చేయడం రివాజు. దీన్ని సమూలంగా మార్చి కేవలం తన స్టెప్పులతో ధియేటర్లను మోతెక్కించారు అక్కినేని.
మనంతో కలిపి అక్కినేని నటించిన చిత్రాల సంఖ్య 256. అందులో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన చిత్రాలు రెండొందల పైచిలుకు ఉంటాయి. అక్కినేని ఎన్నడూ తన స్థాయికి తగని చిత్రాలు చేయలేదు. పాత్రల్లో నటించలేదు. చివరి రోజుల వరకు దాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చారు. సోలోగా ఆయన చివరి సూపర్ హిట్ ప్రేమాభిషేకమే అయినా... మేఘసందేశం, సీతారామయ్యగారి మనవరాలు ఎప్పటికీ గుర్తుంటాయి.
తాను అభిమానించే నటుడు నాగయ్య ధరించిన వాల్మీకి పాత్రలో శ్రీరామరాజ్యంలో కనిపించిన ఏఎన్నార్ తన కుటుంబ హీరోలతో చేసిన మనం తో అభిమానులకూ...ప్రేక్షకులకూ గొప్ప అనుభూతిని మిగిల్చారు. ఎన్నడూ ఓడిపోని నటుడాయన. దిలీప్ కుమార్ లాంటి నటుడి నుంచి ప్రసంశలు అందుకున్న అక్కినేని భౌతికంగా మన మధ్య లేకపోయినా...తెలుగువారి జ్ఞాపకాల్లో మాత్రం చిరంజీవిగా ఎప్పటికీ ఉండిపోతారు.
తాజా వార్తలు
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!







