దేశంలో 10మంది శ్రీమంతులైన బంగారు వ్యాపారస్థులు

- September 27, 2017 , by Maagulf
దేశంలో 10మంది శ్రీమంతులైన బంగారు వ్యాపారస్థులు

మన దేశంలో మహిళలకు బంగారం మీద ఉండే మోజు అంతా ఇంతా కాదు. ప్రతి ముఖ్యమైన సందర్భంలో చాలా ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు బంగారం రూపంలో తమ స్తోమతను బట్టి బహుమతులు ఇస్తుంటారు. కొంత మంది బంగారాన్ని పెట్టుబడి రూపంలో పొదుపు చేసేందుకు కొంటే మరికొంత మంది తరచూ ధరించే కారణంతో కొంటుంటారు. ఒకప్పుడు సంప్రదాయ వ్యాపారులకే పరిమితమైన బంగారు వ్యాపారం ఒక పరిశ్రమగా రూపుదిద్దుకుంది. ప్రభుత్వ అనుమతులు పొంది బంగారం వ్యాపారం చేస్తున్న సంస్థలు 1950ల తర్వాత ఎన్నో వచ్చాయి. ఇలా బంగారం వ్యాపారం ద్వారా అతిధనవంతులైన 10 మంది గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. టీ ఎస్ కల్యాణ్ రామన్‌
కల్యాణ్ జువెలర్స్ ఎండీ కల్యాణ్ రామన్‌. త్రిస్సూర్‌లో 1993లో ఈ సంస్థ ప్రారంభమైంది. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా 2015 చివరి నాటికి 32 షోరూంలు ఉన్నాయి. 12 ఏళ్ల నుంచే వ్యాపారంలో మెలకువలను తన తండ్రి వద్ద నుంచి నేర్చుకున్నారు. దుకాణంలో సాయం చేస్తూ, కామర్స్ చదువు పూర్తిచేశారు. మార్చి 2013 ఫోర్బ్స్ మ్యాగజైన్ బిలియనీర్ల జాబితాలో 1342 స్థానాన్ని దక్కించుకున్నారు. అప్పటికి ఆయన నికర ఆస్తుల విలువ 1.3 బిలియన్ డాలర్లు.
2. నిరావ్ మోదీ
1.1 మిలియన్ డాలర్ల ఆస్తులతో నిరావ్ మోదీ దేశంలోనే 9వ అత్యంత బంగారు వ్యాపారిగా నిలిచారు. ముంబయి కేంద్రంగా నిరావ్ మోదీ పేరుతో అంతర్జాతీయ వజ్రాలు,బంగారు వ్యాపారం ప్రారంభం చేశాడు. 1999లో ఫైర్‌స్టార్ డైమండ్స్ పేరిట కంపెనీని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. మొదట 15 మందితో ప్రారంభమైన కంపెనీలో ఇప్పుడు 1200 మందికి పైగా పనిచేస్తున్నారు. 2013లో మొదటిసారి ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలోకెక్కిన నిరావ్ మోదీ ప్రతి ఏటా ఏదో స్థానాన్ని సంపాదిస్తున్నారు.
3. ఎం. పీ. అహ్మద్‌
మలబార్ గోల్డ్ పేరిట 1993లో ప్రారంభించిన కేరళకు చెందిన గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీకి ఎం.పీ అహ్మద్ చైర్మన్‌. ప్రపంచవ్యాప్తంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు 150 పైగా షోరూంలు ఉన్నాయి. మధ్య ఆసియా, భారతదేశ వ్యాప్తంగా ఎక్కువగా ఈ కంపెనీ విస్తరించి ఉంది. ఈ కంపెనీ టర్నోవర్ 2015 నాటికి 20 వేల కోట్లకు పైగా ఉంది. 2005లో మొదటిసారి కేరళకు బయట మలబార్ గోల్డ్ షోరూంను తెరిచారు. 2012లో మలబార్ గోల్డ్ పేరును మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌గా మార్చారు. ఎం.పీ అహ్మద్‌కు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు శ్యామ్‌లాల్ అహ్మద్ సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాలకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దేశీయ కార్యకలాపాల అధిపతిగా ఆయన అల్లుడు అసర్ ఓ ఉన్నారు.
4. బి. గోవిందన్‌
దేశవ్యాప్తంగా భీమా జువెలర్స్ ఛైర్మన్ బి.గోవిందన్‌. తమ వ్యాపారాన్ని 1925లో కేరళ నుంచి భీమా భట్టార్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రూప్ సంస్థలకు 34 బంగారు దుకాణాలు ఉన్నాయి. 2000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాల్లో భీమా జువెలర్ష్ విస్తరించింది. ఈ కంపెనీ టర్నోవర్ 2013 నాటికే 8000 కోట్లు. దేశంలో బంగారం వ్యాపారాన్ని శాసించే ఆరు అతిపెద్ద కంపెనీల్లో ఇదీ ఒకటి. 
గోవిందన్ నికర ఆస్తుల విలువ 620 మిలియన్ డాలర్లకు పై మాటే.
5. వల్లభ్‌భాయ్ ఎస్ పటేల్
2015 నాటికే ఈయన నికర ఆస్తుల విలువ 590 మిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే ఎక్కువగా వజ్రాలను తయారుచేసే కిరణ్ జెమ్స్‌కు సహ వ్యవస్థాపకుడు వల్లభ్‌భాయ్ పటేల్‌. వజ్రాల తయారీలో మెలకువలకు సంబంధించి 40 ఏళ్ల అనువభం కలిగి ఉన్నారు.
6. వసంత్ గజేరా
1972లో ప్రారంభించిన లక్ష్మీ డైమండ్స్ ఎండీ వసంత్ గజేరా. సూరత్ కేంద్రంగా ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో 5వేల మంది ఉద్యోగులతో లక్ష్మీ డైమండ్స్ వ్యాపార నిర్వహణను కొనసాగిస్తున్నది. రెంతో అతిపెద్ద ఎగుమతిదారుగా ఈ సంస్థ 8 సార్లు అవార్డును గెలుచుకున్నది. వసంత్ గజేరా నికర ఆస్తుల విలువ 580 మిలియన్ డాలర్లు.
7. లాల్ జీ భాయ్ పటేల్‌
దేశ వజ్రాల పరిశ్రమలో పేరెన్నికగన్న ధర్మనందన్ డైమండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ లాల్‌జీ పటేల్‌. మూడున్నర దశాబ్దాలకు పైబడి వజ్రాల తయారీ, వ్యాపారంలో ఉన్నారు. కేవలం వ్యాపారం పరంగానే కాకుండా సామాజిక సేవా కార్యకలాపాల ద్వారా ఈయన పేరు గడించారు. ఓబామా పర్యటన సందర్భంగా ఒకసారి మోదీ ధరించిన సూట్‌ను వేలం వేస్తే 8వేల రూపాయల విలువ చేసే దాన్ని రూ.4.31 కోట్లకు లాల్‌జీ కొనుగోలు చేశారు. ఈ వేలం సొమ్మును ప్రభుత్వం గంగా శుధ్ది కార్యక్రమానికి కేటాయించింది. రిటైల్ జెవలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి లాల్ జీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును గెలుచుకున్నారు.
లాల్ జీ పటేల్ ఆస్తుల విలువ 480 మిలియన్ డాలర్లు.
8. బాబూ భాయ్ లఖానీ
కిరణ్ జెమ్స్ అనే వజ్రాభరణాల తయారీ కంపెనీకి ఎండీగా లఖానీ వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థకు సహ వ్యవస్థాపకుడు కూడా. కంపెనీ ప్రధాన వ్యవహారాల్లో ఒకటైన లోహ సేకరణలకు సంబంధించిన విధులను ఈయన నిర్వర్తిస్తున్నారు. ముడి లోహాన్ని సేకరించడంలో 40 ఏళ్ల అనుభవాన్ని గడించారు. ఈయన నికర ఆస్తుల విలువ 470 మిలియన్ డాలర్లు(2015 ప్రకారం)
9. మావ్‌జీ భాయ్ పటేల్
కిరణ్ జెమ్స్ మరొక సహ వ్యవస్థాపకుడు మావ్‌జీ పటేల్‌. వజ్రాల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ కిరణ్ జెమ్స్‌. సంస్థ ఆర్థిక వ్యవహారాలు, మార్కెటింగ్ వ్యూహాలు, లూజ్ డైమండ్స్‌, డైమండ్ జెవలరీ అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకం జరిగేలా చూడటం వంటి వ్యవహారాలు ఈయన అధ్వర్యంలోనే జరుగుతాయి. ఈయన ఆస్తుల విలువ 410 మిలియన్ డాలర్లు.
10. రాజేష్ మెహతా
ఫోర్బ్స్ ధనవంతుల్లో చాలా మంది పేర్లు మీరు విని ఉండొచ్చు. కానీ ఈ పేరు ప్రత్యేకం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వ్యాపారం కంపెనీ అధిపతి ఆయన. ఆయనే రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ వ్యవస్థాపకులు రాజేష్ మెహతా. బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థను తన సోదరుడు ప్రశాంత్ మెహతాతో కలిసి 1989లో స్థాపించారు. ఈ సంస్థ రెవెన్యూ రూ.2,42,132 కోట్లు కాగా, నిర్వహణ ఆదాయం రూ.1,65,211 కోట్లుగా ఉంది. అమెరికా డాలర్ల పరంగా చూస్తే రాజేష్ మెహతా నికర ఆస్తుల విలువ 310 మిలియన్ డాలర్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com