అయోధ్యలో 2 లక్షల దీపాలతో దీపావళి సంబరాలు.!

- October 18, 2017 , by Maagulf
అయోధ్యలో 2 లక్షల దీపాలతో  దీపావళి సంబరాలు.!

యూపీలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్యలో నిర్వహించిన భారీ దీపోత్సవంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు దాదాపు 2వేల మంది స్కూల్ విద్యార్థినులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రెండు లక్షల దీపాలను వెలిగించారు. ఇందులో లక్షా 71 వేల దీపాలను సరయూ నది ఒడ్డున ఏర్పాటు చేశారు. రామజన్మభూమి అయోధ్యను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేయడంలో భాగంగా.. గిన్నీస్‌ రికార్డ్ కోసం సీఎం ఈ దీపోత్సవాన్ని ప్లాన్ చేశారు. గతంలో ఈ రికార్డ్‌ గుర్మీత్ బాబాకు చెందిన డేరా ఆశ్రమం పేరిట ఉంది. గత ఏడాది లక్షా 50వేల దీపాలను డేరా అనుచరులు వెలిగించారు. దీపాలను పరిశీలించిన తర్వాత ఈ రికార్డ్ పై  గిన్నీస్‌ ప్రతినిధులు  ప్రకటన చేయనున్నారు. అయోధ్య మానవత్వానికి మాతృభూమి అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామరాజ్యం ద్వారానే ప్రపంచానికి మానవత్వాన్ని చాటి చెప్పిన చరిత్ర మనదని అన్నారు. దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన యోగి సర్కార్.. రామాయణం నాటి ఘట్టాన్ని ప్రతిబింబించేలా.. సీతా రామలక్షణులను అయోధ్యకు తీసుకువచ్చింది. అప్పట్లో రావణాసుర వధ అనంతరం రాముడు, సీత, లక్ష్మణుడు పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చారు. ఇప్పుడు.. పుష్పక విమానం లేకపోవడంతో.. హెలికాప్టర్‌లో సీతా రామ లక్ష్మణ పాత్రధారులను అయోధ్యకు తీసుకువచ్చారు. హెలికాప్టర్‌లో నుంచి దిగిన సీతారామలక్ష్మణులకు సాదర స్వాగతం పలికారు సీఎం ఆదిత్యనాథ్. అనంతరం వేదికపైకి తీసుకు వెళ్లి ఘనంగా సన్మానించారు. ఆనాటి సీతారాములను తలపించిన ఈనాటి సీతారాములను చూసి మురిసిపోయారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com