హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయ విస్తరణకు రూ.490 కోట్లు

- October 24, 2017 , by Maagulf
హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయ విస్తరణకు రూ.490 కోట్లు

బాండ్‌ మార్కెట్‌ నుంచి సమీకరించిన మొత్తాలను వెచ్చిస్తాం
జిఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ కపూర్‌ వెల్లడి
హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సుమారు 490 కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించేందుకు జిఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జిహెచ్‌ఐఎఎల్‌) రెడీ అవుతోంది. అంతర్జాతీయ బాండ్‌ మార్కెట్‌ నుంచి సమీకరించనున్న 35 కోట్ల డాలర్ల (రూ.2,275 కోట్లు)లో 7.5 కోట్ల డాలర్ల (రూ.490 కోట్లు)ను హైదరాబాద్‌ విమానాశ్రయ విస్తరణకు వెచ్చించనున్నట్లు జిఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ కపూర్‌ తెలిపారు. మిగిలిన 27.5 కోట్ల డాలర్ల మొత్తాలను రుణాల చెల్లింపులకు వెచ్చించనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో వడ్డీ వ్యయాలు 1-15 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌ విమానాశ్రయ రుణ భారం 2,000 కోట్ల రూపాయలుండగా రీఫైనాన్స్‌ ద్వారా 40-45 కోట్ల రూపాయల వడ్డీ వ్యయాలను ఆదా చేసుకునే అవకాశం లభించనుందని కపూర్‌ తెలిపారు. కాగా హైదరాబాద్‌ విమానాశ్రయాన్ని 2,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో విస్తరించే అవకాశాలున్నాయని రేటింగ్‌ సంస్థలు గతంలో అంచనా వేశాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ విమానాశ్రయ ప్రయాణికుల సామర్థ్యం ఏటా 1.2 కోట్లుగా ఉండగా దీన్ని 2 కోట్లకు పెంచే విధంగా విమానాశ్రయాన్ని విస్తరించాలని జిహెచ్‌ఐఎఎల్‌ భావిస్తోంది. విమానాశ్రయ విస్తరణకు సంబంధించిన అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, విస్తరణకు ఎంత మొత్తం అవసరం అవుతుందనేది ఇప్పుడే చెప్పటం కష్టం కావటంతో తొలుత 500 కోట్ల రూపాయలు కేటాయించాలని భావిస్తున్నట్లు కపూర్‌ తెలిపారు.
కాగా జిహెచ్‌ఐఎఎల్‌లో ప్రస్తుతం జిఎంఆర్‌ గ్రూప్‌కు 63 శాతం వాటాలుండగా దీన్ని 51 శాతం కంటే తగ్గించుకునే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ గ్రూప్‌.. వాటా విక్రయించాలని భావిస్తే అది కేవలం 12 శాతం మాత్రమే విక్రయించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే వాటాల విక్రయ యోచనేదీ లేదని, సరైన సమయంలో ఈ విషయంపై స్పందిస్తామని వెల్లడించారు. జిహెచ్‌ఐఎఎల్‌లో జిఎంఆర్‌ గ్రూప్‌కు 63 శాతం వాటాలుండగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ), తెలంగాణ ప్రభుత్వానికి చెరో 13 శాతం వాటాలు, మలేషియా ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌ బెర్హాద్‌కు 11 శాతం వాటాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com