అమెరికాలో చిన్నారి షెరిన్‌ తండ్రి అరెస్టు

- October 24, 2017 , by Maagulf
అమెరికాలో చిన్నారి షెరిన్‌ తండ్రి అరెస్టు

అమెరికాలో గత కొన్నిరోజులుగా అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి షెరిన్‌ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. షెరిన్‌ ఇంటికి సమీపంలో లభించిన గుర్తుతెలియని చిన్నారి మృతదేహం వివరాలు కూడా ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో చిన్నారి తండ్రి వెస్లీ మాథ్యూస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో వెస్లీ తన కుమార్తె అదృశ్యంపై పొంతనలేని విషయాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
డాలస్‌ శివారు ప్రాంతానికి చెందిన వెస్లీ మాథ్యూస్‌ తన మూడేళ్ల కుమార్తె షెరిన్‌ పాలు తాగట్లేదని అక్టోబర్‌ 7న చిన్నారికి కఠిన శిక్ష విధించిన విషయం తెలిసిందే. రాత్రంతా ఇంటి బయటే నిలబడాలని ఆమెను ఆదేశించాడు. అయితే అప్పటి నుంచి షెరిన్‌ కనబడకుండా పోయింది. చిన్నారిని ఇంటి నుంచి పంపించిన 15 నిమిషాలకే తాను వెళ్లి చూశానని.. అప్పటికే పాప కనబడలేదని వెస్లీ చెప్పాడు. అయితే అఫిడవిట్‌లో మాత్రం తాను సూర్యోదయం అయ్యాక వెళ్లి చూశానని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. గత ఆదివారం వెస్లీ ఇంటికి సమీపంలో ఓ చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహం షెరిన్‌దే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మృతదేహం దొరికిన తర్వాత వెస్లీ మాటమార్చినట్లు, పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే అతడు ఏం చెప్పాడో మాత్రం బయటకు వెల్లడించలేదు. దీంతో అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. భారత్‌లో పుట్టిన షెరిన్‌ను వెస్లీ దంపతులు రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com