భాగ్యనగరంలో గుప్పుమంటున్న విదేశీ మద్యం!

- October 26, 2017 , by Maagulf
భాగ్యనగరంలో గుప్పుమంటున్న విదేశీ మద్యం!

గరంలో యథేచ్ఛగా అమ్మకాలు 
సర్కారు ఆదాయానికి భారీగా గండి 
నిఘా పెంచిన ఆబ్కారీ శాఖ 
ఈనాడు, హైదరాబాద్‌ 
న గరంలో ఇటీవల విదేశీ మద్యం గుప్పుమంటోంది. ఎక్కడ కావాలంటే అక్కడ వివిధ దేశాలకు చెందిన మద్యం సీసాలు దొరుకుతున్నాయి. అధికారులు ఎంత నిఘా పెట్టినా విదేశీ మద్యం అమ్మకాలను కట్టడి కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ఖజానా ఆదాయానికి భారీ స్థాయిలో గండిపడుతోంది. కొన్నేళ్లుగా ఎప్పుడూ ఇంత భారీస్థాయిలో విదేశీ మద్యం నగరంలో అమ్మకాలు సాగలేదని పలువురు వివరిస్తున్నారు. ఇటీవల అడ్డు అదుపు లేకుండా వీటి అమ్మకాలు సాగుతున్నాయని వివరిస్తున్నారు. వీటి ధరలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అమ్ముతున్నారు. నగరంలో అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. గతంలో లైసెన్స్‌ తీసుకున్న దుకాణదారుల గడువు సెప్టెంబర్‌ 30తో ముగిసింది. పాత మద్యం దుకాణాలు 170 వరకు ఉంటే ఈ సంఖ్య ప్రస్తుతం 183కి పెరిగింది. ఇవికాకుండా నగరంలో పలుప్రాంతాల్లో బార్‌లు ఉండనే ఉన్నాయి. దీంతో దాదాపు ప్రతిప్రాంతంలో మద్యం అందుబాటులోకి వచ్చినట్లు అయింది. అయినా విదేశీ మద్యం అమ్మకాలు జోరుగా సాగడంపై ఆబ్కారీ అధికారులు విస్తుపోతున్నారు. దీనిని నిలువరించేందుకు కొన్నిరోజులుగా ప్రత్యేక నిఘా పెట్టారు. కొన్ని బృందాలను దీనికోసం నియమించినట్లు సమాచారం. ఎక్కడెక్కడ విదేశీ మద్యం ఎవరి ద్వారా వస్తుందో ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఎవరైనా ప్రముఖులు ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.
విదేశీ ముసుగుతో అమ్మకాలు.. 
విదేశీ మద్యం తాగేందుకు మందుబాబులు ఆసక్తి చూపడంతో కొందరు దీని పేరుచెప్పి స్వదేశీ మద్యంను అమ్మేస్తున్నారు. విదేశీ మద్యం ఖాళీ సీసాలను సేకరించి అందులో స్థానికంగా దొరికే మద్యాన్ని నింపుతున్నారు. విదేశీ మద్యం పేరుతో అధికధరలకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో సీసాకు రూ.500 వరకు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఇటీవల ముంబయికి చెందిన ముఠా నగరంలో గత కొన్నేళ్లుగా ఇదే తరహాలో విదేశీ మద్యం పేరుతో అమ్మకాలు సాగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరి నుంచి 142 నకిలీ మద్యం సీసాలను, 183 ఖాళీ మద్యం సీసాలను ఆబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మద్యం అమ్ముతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆబ్కారీశాఖ టోల్‌ఫ్రీ నెంబరు 18004252523ను అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.
దొరుకుతున్నది కొందరే.. 
బెంగళూరు బస్సులో నగరానికి తరలిస్తున్న 31 విదేశీ మద్యం సీసాలను ఈనెల 16న రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు పట్టుకున్నారు. ఒక ప్రైవేటు బస్సులో సోదాలు నిర్వహించగా ఈ మద్యం దొరికింది. దీని వెనుక అసలు నిందితులు ఎవరున్నారు.. ఎంతకాలం నుంచి ఈవిధంగా తరలిస్తున్నారు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. నగరం నుంచి వందలాది బస్సులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నాయి. వీటి అన్నింటినీ అధికారులు నిత్యం తనిఖీలు చేయడం సాధ్యం కాదు. దీంతో అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. ఇదే అదనుగా పలువురు మద్యం అక్రమ మార్గంలో దిగుమతి చేస్తూనే ఉన్నారు. విదేశీ మద్యం అమ్మకాలు నగరంలో పలువురు దళారుల ద్వారా గుట్టుగా సాగిస్తున్న అసలైన వ్యాపారులు దొరకట్లేదు. అమ్మేకాలు, రవాణా చేసే వ్యక్తులే దొరుకుతున్నారు. దీంతో ఈ వ్యాపారం నగరంలో గుట్టుగా సాగిపోతూనే ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com