జాతీయ గీతం

జాతీయ గీతం

జాతీయ గీతం: 

రక్తం ఎరుపని తెలుసు;
కానీ...
నా రక్తం త్రివర్ణం అనుకున్నప్పుడే
నా నరాల్లో ప్రవహ శబ్దం వినిపిస్తుంది. 

రక్తం పంచుకోలేదని తెలుసు;
కానీ...
నా జాతిపితగా మహాత్ముడిని తలచినప్పుడే 
నా వారసత్వ బాధ్యత గుర్తుకొస్తుంది.

పేగు బంధం కాదని తెలుసు;
కానీ...
నను కన్నది నా భరతమాత అని అనుకున్నప్పుడే 
నాలో దేశభక్తి ఉబికొస్తుంది. 

అనుకోవడంలో ఉన్న శక్తి ముందు
తెలుసుకున్న సత్యాలు బలాదూర్;

జాతీయ గీతాన్ని వింటూ
ఒక్క నిమిషం నిలబడేందుకే 
గుండెల్లో కోరిక 
కాళ్లల్లో ఓపిక 
లేని మనం 
ఒలింపిక్ మెడల్స్ కోసం పరుగెందుకు?

జాతీయగీతం కోసం
జాతి గరిమ కోసం
జాతి అభివృద్ధి కోసం
జాతి ఐక్యత కోసం 
జాతి రక్షణ కోసం
నిలబడదాం. 

దైవం కన్నా దేశమే గొప్పది
దైవానికి తలనీలాలే ఇస్తాం
దేశానికి తలనే ఇస్తాం. 

-సిరాశ్రీ 
28/10/17

Back to Top