ఏటీఎం నుంచి బయటపడ్డ డూప్లికేట్ నోటు కలకలం

- October 29, 2017 , by Maagulf
ఏటీఎం నుంచి బయటపడ్డ డూప్లికేట్ నోటు కలకలం

హైదరాబాద్‌లో దొంగ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత కూడా దొంగనోట్లు బయటపడటంతో.. నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా చైతన్యపురిలోని ఓ ఏటీఎం నుంచి రెండు వేల రూపాయల దొంగనోటు బయటకు రావడం కలకలం రేపింది.

సూర్యాపేట జిల్లాకు చెందిన సురేష్‌ అనే విద్యార్థి.. డబ్బులు డ్రా చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సురేష్‌ కుటుంబ సభ్యులు అతని బ్యాంక్‌ అకౌంట్‌లో నగదు జమ చేయగా.. సురేష్‌ నిన్న సాయంత్రం చైతన్యపురిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంలో 30 వేలు డ్రా చేశాడు. ఇందులో ఒక రెండు వేల రూపాయల నోటు నకిలీది ఉన్నట్లు సురేష్‌ గుర్తించాడు. అసలు నోటుకు బదులు.. కలర్‌ జిరాక్స్‌ తీసిన నకిలీ నోటు వచ్చిందని చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంక్‌ అధికారులకు సైతం ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా శనివారం సెలవు దినం కావడంతో అందుబాటులో లేరు. రేపు బ్యాంకులు ప్రారంభమయ్యాక.. దొంగనోటు వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేస్తానంటున్నాడు సురేష్‌.

నోట్ల రద్దు తర్వాత కూడా దొంగనోట్ల బెడద వదలకపోవడంపై.. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దుతో దొంగనోట్లకు చెక్‌ పెట్టామంటున్న మోదీ ప్రభుత్వం.. ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నిస్తున్నారు. కాగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి గతంలో దొంగనోట్లు వచ్చేవి. ఆ రెండు దేశాల్లో నకిలీ నోట్లు ముద్రించిన కేటుగాళ్లు.. వాటిని ఇక్కడ చెలామణి చేసేవారు. ఈ నేపథ్యంలోనే దొంగ నోట్లకు చెక్‌ పెట్టేందుకు కేంద్రప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. దొంగతనంగా ముద్రించేందుకు వీల్లేకుండా కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా ఏటీఎం నుంచే దొంగ రెండు వేల రూపాయల నోటు రావడం.. కలకలంగా సృష్టిస్తోంది. ఏటీఎంలలో నగదు సమకూర్చే సంస్థలపై బ్యాంకు అధికారులు నిఘా పెట్టకపోవడంతోనే.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని జనం ఆరోపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com