ఓ దేశం కనుమరుగు కానుంది
- October 29, 2017
మరో యాభై ఏళ్లల్లో ఓ సంస్కృతి విచ్ఛిన్నం కానుంది. ఓ దేశం కనుమరుగు కానుంది. ఓ దీవుల సముదాయం సముద్రంలో శాశ్వతంగా మునిగిపోనుంది. ఆ దీవుల్లో ఇన్నాళ్లు మనుగడ సాగిస్తోన్న ఓ జాతి భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. మన పక్కనున్న మాల్దీవుల దుస్థితి కన్నా తీవ్రంగా ఉన్న కిరిబాతి గురించే ఈ వారం వివరం.
దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని కిరిబాతిని అద్భుత తీరాలోకంగా పిలుస్తారు. 33 అందమైన అటోల్లు, ఓ పగడపు దీవి ఇక్కడి ప్రత్యేకతలు. కిరిబాతికి చెందిన కిరిమాతి (క్రిస్మస్ ఐలాండ్) ప్రపంచంలోనే అతిపెద్ద అటోల్. ఈ అందాలన్ని, అద్భుతాలన్ని భూతాపం, వాతావరణ మార్పుల వల్ల కనుమరుగు కానున్నాయి. కిరిబాతిలోని పదుల దీవులు సముద్ర మట్టానికి కేవలం 2 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కొన్ని చోట్ల ఇంకా తక్కువే. కథల్లో చెప్పుకునే అట్లాంటిస్లాగా ఈ దీవి కూడా సముద్రంలో కలిసిపోవడానికి కారణమిదే. ఈ మధ్యే కిరిబాతి అధ్యక్షుడు అనోట్ టోంగ్ గోవాలో పర్యటించినపుడు తమ దేశస్తులు మిగతా ప్రపంచంతో కలిసిపోయేలా మానవ నైపుణ్యాల్ని భారత్ అందించాలని కోరాడు. ఆయన ఆవేదనల్లా గ్లోబల్ వార్మింగ్‌కు అస్సలు కారణం కాని, శిలాజ ఇంధనాల వాడకం అత్యల్పంగా ఉండే తమ దీవులు మిగతా దేశాల వల్ల సముద్రం పాలుకావడమేంటనే. మిగతా దేశాలతో అంత సంబంధం లేకుండా ఇన్నాళ్లు తమదైన జీవన విధానంతో బతికినవారికి ఒక్కసారిగా ఒకే తరంలో ఇంత ఉపద్రవం ఎదురైంది. వచ్చే 30 ఏళ్లలోనే ఇక్కడి మంచినీటి తావుల్లో సముద్ర జలాల కలుషితం వల్ల తాగేనీటికి సమస్య తీవ్రమవుతుందని ఓ నివేదిక. దీవులు మునగక ముందే ఇక్కడ మనిషి మనుగడ సాగించే అవకాశాలు లేకుండా పోతాయన్నమాట. రెండు లక్షల చదరపు మైళ్ల విస్త్రీర్ణంలో ఉండే కిరిబాతి సముద్ర ప్రాంతాన్ని శూన్య సముద్రం ప్రాంతంగా చూడ్డానికి కారణం... దాదాపు సముద్ర మట్టానికే ఉన్నా దీవుల్లోకి నీళ్లు చేరకపోవడమే. ఈ ప్రాంతంలో 310 చదరపు మైళ్ల నేలప్రాంతం ఉంటుంది. ఇక్కడి జనాభా కూడా కొన్ని ప్రాంతాల్లోనే కిక్కిరిసి ఉంటుంది. చదరపు కి.మీ.కు 3000 చొప్పున దక్షిణ తరావా దీవిలో ఉంటారు. అంటే లాస్ ఏంజెల్స్, లండన్ వంటి మహా నగరాల్లోని కొన్ని ప్రాంతాల జనాభా నిష్పత్తితో సమానం. 2030 నాటికి ఈ ఒక్క దీవిలోనే లక్ష మంది జనాభా ఉంటారు. వీరందరినీ ఎక్కడికి తరలించాలనేదే ఇప్పుడో పెద్ద ప్రశ్న. బైక్మెన్ అటోల్ని ఇప్పటికే సముద్రం చుట్టుముట్టింది. ఇంకా అక్కడ కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. 1999లోనే ఇక్కడి టెబువా తరావా, అబాన్యువా దీవుల్ని సముద్రం మింగేసింది. లా నినా, ఎల్‌నినో ప్రభావాల వల్ల ఇక్కడ సముద్ర కెరటాల తాకిడి ఎక్కువ. దీవిలోని మట్టి కోసుకుపోవడం వల్ల తీరం తగ్గిపోతోంది. తుఫానుల ప్రభావం తక్కువే ఉన్నా ఈ మధ్య వచ్చిన సైక్లోన్ పామ్ వల్ల సముద్రపు నీరు దీవుల్లోకి వరదెత్తింది.
వేల ఏళ్ల కిందటే..
స్థానికుల జానపద కథల ప్రకారం నరియా అనే భారీ సాలీడు సృష్టికర్త! మిషనరీ మతాల ప్రభావం ఎక్కువున్నా 'అంటీ' అనే గ్రామదేవతల్ని ఇప్పటికీ కొలుస్తుంటారు. సముద్ర భాషలు మాట్లాడే మైక్రోనేషియన్లు క్రీ.పూ.3000 ఏళ్ల కిందటే ఈ దీవుల్లో నివసించేవారు. ఫిజీ, సమోవా, టోంగా ప్రాంతాల వారితో పరిచయాలున్నాయి. పాలినేషియా, మెలనేషియా జాతుల సమ్మేళనంతో ఓ ప్రత్యేక సంస్కృతి తయారైంది. 17, 18 శతాబ్దాల్లో యూరోపియన్ నౌకలు నిలవడం, ఆ తర్వాత బ్రిటిష్ రాజ్యంలో కలిసింది. రెండో ప్రపంచ యుద్ధ ప్రాంతాల్లో ఇదొకటి. కిరిబాతి 1972లో స్వాతంత్య్రం తెచ్చుకుంది. బనాబా, గిల్బెర్ట్, ఫీనిక్స్, లైన్ ద్వీప సముదాయాల్లో 21 దీవుల్లో ప్రస్తుతం ప్రజలు నివసిస్తున్నారు. ఫిజీలో 6 వేల ఎకరాలు కొని ఏడాదికి 75 మంది చొప్పున అక్కడకి పంపించి తమ జాతిని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు దేశాధ్యక్షుడు. కనీసం ఒక దీవిలోనైనా మట్టిపోసి ఎత్తు పెంచి తమ అస్థిత్త్వం నిలుపుకునేందుకు ప్రపంచం సాయపడాలని కోరుతున్నాడు. ఇప్పటికే దుబారు, చైనా మరికొన్ని దేశాలు కృత్రిమ ద్వీపాలను నిర్మించాయి. ఆ సాంకేతికతతో కిరిబాతిని బతికించుకోవాలనే అతడి పట్టుదల ఏమవుతుందో చూడాలి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు