ఇకపై బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించనున్న టీమిండియా.!

- November 03, 2017 , by Maagulf
ఇకపై బిజినెస్‌ క్లాస్‌లో  ప్రయాణించనున్న టీమిండియా.!

ఇక నుంచి భారత క్రికెటర్లు బిజినెస్‌ క్లాస్‌లో విహరించనున్నారు. సొంతగడ్డపై మ్యాచ్‌ల కోసం ఆటగాళ్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విమానంలో వెళ్తారన్న సంగతి తెలిసిందే. ఎకానమీ క్లాస్‌లో వెళ్లే ఆటగాళ్లు ఇక నుంచి బిజినెస్‌ క్లాస్‌లో వెళ్లేలా బీసీసీఐ వెసులుబాటు కల్పించింది. ఈ ప్రతిపాదనను త్వరలో అమలు చేయాలని బీసీసీఐ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ సీకే ఖన్నా ఇప్పటికే సంబంధిత అధికారులకు లేఖ రాశారు. రెండు నెలల క్రితం భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రవిశాస్త్రి ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని బీసీసీఐను కోరిన సంగతి తెలిసిందే. ఎకానమీ క్లాసులో ఆటగాళ్లు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కోసారి అభిమానుల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. వారి సీట్లలో ఇతరులు కూర్చుంటున్నారు. అంతేకాదు ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు దిగాలని కోరుతున్నారు. ఈ సమస్యలను కెప్టెన్‌ కోహ్లీ కూడా పలుమార్లు బీసీసీఐ దృష్టికి తీసుకువచ్చాడు. అంతేకాదు పాండ్య, కేఎల్‌ రాహుల్‌, మహమ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ లాంటి పొడగరి ఆటగాళ్లు ఎకానమీ క్లాస్‌లో కూర్చుని ప్రయాణించాలన్నా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై చర్చించిన బీసీసీఐ ఇక నుంచి ఆటగాళ్లు బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు లేఖ రాశారు. వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనను అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com