ఫ్రెండ్స్ దీపావళి ఉత్సవం-2015

- November 10, 2015 , by Maagulf

 


దుబాయి - ఫ్రెండ్స్ దీపావళి ఉత్సవం-2015  - జె.ఎస్.ఎస్. ఇంటర్నేషనల్ స్కూల్, అల్ బర్ష, దుబాయి లో  06-నవంబర్-2015 సాయంత్రం 3.00 గంటల నుండి సాంప్రదాయ లక్ష్మీ పూజతో మొదలయ్యి రాత్రి 10.00 గంటల వరకు కన్నుల పండుగగా అంగ రంగ వైభవంగా జరిగింది.  

ఫ్రెండ్స్ దీపావళి ఉత్సవం-2015 నిర్వాహకులు - విదేశాల్లో జీవనం సాగిస్తున్న మరియు భారత సంతతికి చెందిన ప్రజలందరు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వాన్ని రాబోయే తరాల వారికి పదిలంగా అందించాలనే సత్ సంకల్పముతో ఒకే వేదికగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి పలు వ్యాపార సంస్థలను ఆహ్వానించి వారి సహకారముతో ఈ దీపావళి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  

ఈ వేడుకల్లో దాదాపుగా 4000 మంది సందర్శకులు పాల్గొన్నారు.  యు.ఏ.ఇ. లో నివసించే భారతదేశములోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఆనందాన్ని పదిలపరుచుకున్నారు. పలు రాష్ట్రాల సాంప్రదాయాలు, సంగీత నృత్య ప్రదర్శనలతో వేదిక పులకరించిపోయింది.  పిన్నలు పెద్దలు తేడా లేకుండా రకరకాల ఆట పాటల్లో పాల్గొన్నారు.  చిన్న పిల్లల కోలాహళం అంతా ఇంతా కాదు.  పిల్లలు చేసే అల్లరికి పెద్దలు కూడా పిల్లలయ్యారంటే  ఇంతకన్నా మహత్ భాగ్యము వేరే కలదా.  "యునిటి ఇన్ డైవర్సిటి" పేరుతో నిర్వహించిన  రంగవల్లుల పోటీలు సాంప్రదాయ దుస్తుల్లో అందంగ అలంకరించుకొని వచ్చిన ఆడపడుచులతో సందడి చేశాయి. కార్యక్రమాలను తిలకిస్తూ సందర్శకులు ఆద్యంతం ఆనందముతో పరవశించిపోయారు.   నిర్వాకులు పలు రాష్ట్రాల సాంప్రదాయాల రకరకాల వంటలు సందర్శకులకు మన్ పసందైన రుచులను  వడ్డించి ప్రజల మన్ననలను పొందారు.   

వేదిక అధునాతనమైన పరికరములతో రంగు రంగుల జిలుగు వెలుగులతో,  శబ్ద తరంగాలతో, సిల్వర్ స్క్రీన్ తో ఎంతో అందంగ ముస్తావయ్యింది.  పలు రాష్ట్రాల ఆడ పడుచుల సాంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శన ఉత్సవానికే వన్నెలు దిద్దించి.  

దుబాయి లో ఉండే వారికి మాత్రం ఉత్సవం అంటే ముందుగా గుర్తొచ్చేది "ఫ్రెండ్స్ దీపావళి ఉత్సవం".  గత 6 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ ఉత్సవ కమిటీ ఎన్నెన్నో ఉత్సవాలను, సామాజిక సేవా కార్యక్రమాలను తమ బాధ్యతగా నిర్వహిస్తూ వచ్చింది.  మేము సైతం అంటూ యు.ఏ.ఇ.  లో నివసించే వివిధ రాష్ట్రాల ప్రజలు ఈ బాధ్యతల్లో భాగస్వాములయ్యి భారత దేశ కీర్తి పతాకాన్ని ఎగుర వేశారు.  లక్కి డ్రా పోటీల్లో తెలుగు వారికి గోల్డ్ కాయిన్ రావడం కొస మెరుపు.

భారత్ ఒక మహా గొప్ప సంస్కృతికి పుట్టినిళ్ళు. భిన్నత్వములో ఏకత్వం అన్నది ఒక్క భారత్ కే దక్కిన అరుదైన గౌరవం.  భారతదేశం వివిధ దేశాల మరియు రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాలకు ప్రాతినిధ్యం వహించే ఏకైక వేదిక.  ఇక్కడ నివసించే ప్రజల వేష భాషలు, ఆహార నియమాలు , కుల మతాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, సంస్కృతి, సాంప్రదాయాలు వేరైనప్పటికి భిన్నత్వములో ఏకత్వం - మనమంతా ఒక్కటే నన్న గొప్ప సత్యానికి కట్టుబడి సహజీవనం సాగిస్తున్న ఏకైక దేశం మన భారత దేశం.  మానవ విలువలు సహజ సంపదలుగా కలిగిన ధనిక దేశం అనుట అతిశయోక్తి కాదేమో.  

భారత్ ఎప్పుడూ నిత్య నూతన సృష్ఠే. అది ప్రపంచ పరిస్థితులకు అనుకూలంగా తన సహజ సుందరమైన స్వభావాన్ని కోల్పోకుండా ఎల్లప్పుడూ ఎల్ల వేళల ప్రపంచానికి దిశా నిర్దేశం చేస్తూ మార్గదర్శకత్వం వహిస్తూ జగత్ గురువుగా నిలిచింది.  భారత్ ఎప్పుడూ జగద్గురువే.  భగవంతుడే పలు కాలాల్లో మనసుపడి పూర్ణ పురుషుడిగా అవతరించిన పుణ్య భూమి.  ఋషులు, మునులు తపస్సు చేసి పరమాత్మను చేరడానికి రాచ మార్గాన్ని వేసిన ధన్య భూమి.  


దుబాయిలో ఉత్సవం అంటే అంత సులభం కానే కాదు.  ఈ ఉత్సవ నిర్వాహకులు ఎన్నెన్నో వ్యయ ప్రయాసలను ఒనర్చి మన భారత కీర్తి పతాకాన్ని, సాంప్రదాయాన్ని ముందు తరాల వారికి అందించాలనే సత్ సంకల్పముతో నిర్వహించి, పూర్ణ భారతాన్ని ఒకే వేదికపై ఉంచి అందరి మన్ననలను పొందింది.   

ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశాన్ని మరియు భారత దేశ వైభవాన్ని గూర్చి ఉత్సవ కమిటీ   కో-ఆర్డినేటర్ అయిన  శ్రీ బోడ నర్సింగం గారు వివరించారు.  

--బోడ నర్సింగం, C.A.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com