మెట్రో రైలు.. తేడా వస్తే జైలు!

- November 14, 2017 , by Maagulf
మెట్రో రైలు.. తేడా వస్తే జైలు!

హైదరాబాద్: రాజధానికి తలమానికం కానున్న మెట్రో రైలు ప్రాజెక్టు మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ట్రాఫిక్‌ కష్టాలు తీరుస్తుందని భావిస్తున్న మెట్రో రైళ్లలో ప్రయాణం కోసం భాగ్యనగర వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనేవి ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్వే సంస్థ విడుదల చేసింది. వీటితో పాటు నిబంధనలు గురించి కూడా ప్రయాణికులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని ప్రతి మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సూచికల ద్వారా తెలుస్తోంది. ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలను తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషల్లో నోటీసు బోర్డులో పెట్టారు.

అతిక్రమణకు పాల్పడేవారికి జరిమానాతో పాటు గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. మెట్రో రైల్ (వినియోగం, నిర్వహణ) చట్టం-2002 ప్రకారం కొన్ని ఉల్లంఘనలకు జైలు శిక్ష విధిస్తారు. విధ్వంసక చర్యలకు దిగేవారికి సెక్షన్‌-74 కింద గరిష్టంగా పదేళ్లు కఠిన కారాగార శిక్ష విధించనున్నారు. మెట్రో రైళ్లు, స్టేషన్లలో ఎటువంటి అతిక్రమణలకు పాల్పడినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ మెట్రో రైల్‌ బోర్డు సూచించింది. కాగా, ఒక్కో మెట్రో రైలులోని మూడు కార్లలో ఒకేసారి గరిష్ఠంగా 974 మంది ప్రయాణించే వీలుంది. ప్రతి మెట్రో రైలులో 126 మంది కూర్చుని, 848 మంది నిలబడి ప్రయాణించడానికి అనువుగా డిజైన్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com