గుండెపోటును 6గంటల ముందే గుర్తించవచ్చు!

- November 18, 2017 , by Maagulf
గుండెపోటును 6గంటల ముందే గుర్తించవచ్చు!

ఒకప్పుడు కేవలం వయోధికులకు మాత్రమే ఎదురయ్యే ప్రధాన సమస్య గుండెపోటు. నేటి ఆధునిక జీవనశైలి కారణంగా యుక్త వయసు వారికీ ఈ సమస్య ఎదురవుతోంది. గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఎంత త్వరగా చికిత్స అందిస్తే అతను బతికే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. అయితే, ఆ మహమ్మారి ఏ క్షణంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ, తాను కనిపెట్టిన పరికరం ద్వారా ఆరుగంటల ముందే ఈ ప్రమాదాన్ని పసిగట్టవచ్చని అంటున్నాడు 16 ఏళ్ల బాలుడు ఆకాశ్‌ మనోజ్‌.

తమిళనాడుకు చెందిన ఆకాష్‌ పదో తరగతి చదువుతున్నాడు. గుండెపోటు వచ్చే సూచనను తాను కనిపెట్టిన కొత్త టెక్నిక్‌ ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నాడు. ఈ పరికరం కనిపెట్టిన ఆకాశ్‌ 'ఇన్నోవేషన్‌ స్కాలర్స్‌ ఇన్‌ రెసిడెన్స్‌ ప్రోగ్రాం' కింద రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నాడు.
 
ఈ సందర్భంగా ఆకాశ్‌ మాట్లాడుతూ.. ''నిశ్శబ్దంగా వచ్చే గుండెపోట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. చాలా మంది పైకి ఆరోగ్యంగానే కనపడతారు. గుండెపోటుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలూ వారిలో కనిపించవు. 'మా తాతయ్య ఆరోగ్యంగా కనిపించేవారు కానీ, ఓ రోజు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయారు.' తాతయ్య మరణం నన్ను బాగా కలిచి వేసింది. గుండెపోటును ముందే కనిపెట్టే పరికరం ఏదైనా తయారు చేయాలనుకున్నా. అందులో భాగంగానే ఈ పరికరాన్ని తయారు చేశా. అయితే దీనిని ఇంకా అభివృద్ధి పరచాల్సి ఉంది. శరీరంపై ఎలాంటి గాయం చేయకుండా దీనిని ఉపయోగించవచ్చు' అని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శన సందర్భంగా పేర్కొన్నాడు.

'రక్తంలో ఉండే ఎఫ్‌ఏబీపీ3 అనే చిన్న ప్రొటీన్‌ను ఉపయోగించి గుండెపోటు ప్రమాదాన్ని కనిపెట్టవచ్చు' అని ఆకాశ్‌ తెలిపాడు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గుండెపోటు ప్రమాదాన్ని ముందే గుర్తించి డాక్టర్‌ను సంప్రదించడం ద్వారా సరైన చికిత్స తీసుకోవచ్చని తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com