'జవాన్‌' చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక

- November 20, 2017 , by Maagulf
'జవాన్‌' చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక

'చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల కలబోతే సాయిధరమ్‌తేజ్‌' అని దర్శకుడు వి.వి.వినాయక్‌ అన్నారు. సాయిధరమ్‌తేజ్‌, మెహరీన్‌ జంటగా బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంలో దిల్‌రాజ్‌ సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'జవాన్‌' (ఇంటికొక్కడు క్యాప్షన్‌). ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమంతోపాటు ప్రీ రిలీజ్‌ వేడుక కూడా ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఘనంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన వినాయక్‌ పాటల సీడీలను విడుదల చేయగా, తొలి సీడీని కొరటాల శివ అందుకున్నారు. 
ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ, 'నాకు ఇష్టమైన దర్శకుల్లో బి.వి.ఎస్‌.రవి ఒకరు. అతన్ని సాయి పిలిచి దర్శకుడిగా ఛాన్స్‌ ఇచ్చాడు. కృష్ణ తొలిసారి నిర్మిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. సాయిధరమ్‌ తేజ్‌తో నేను కూడా సినిమా చేస్తున్నా. 40 రోజులు షూటింగ్‌ చేశాం. సాయి సింగిల్‌ టేక్‌లోనే సీన్‌ చేస్తున్నాడు. కథ, కథనం అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ జవాన్‌ తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు' అని అన్నారు. 
'రవి నా కాలేజ్‌ మేట్‌. తనతో ఉంటే టైమే తెలియదు. అంతలా ఎంటర్‌టైన్‌ చేస్తాడు. నిర్మాత కృష్ణ కూడా నాకు ఎంతో కావాల్సిన వ్యక్తి. ఈ చిత్రాన్ని అందరూ 100శాతం ఎఫర్ట్స్‌ పెట్టి చేశారు. సాయిధరమ్‌తేజ్‌ చాలా పాజిటివ్‌ హీరో. అలాంటి వారు పరిశ్రమలో చాలా తక్కువ. తేజు త్వరలోనే పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా' అని కొరటాల శివ తెలిపారు. 
సాయిధరమ్‌తేజ్‌ చెబుతూ, 'మనం తినే ప్రతి మెతుకుపై మన పేరు రాసి ఉంటుందని అంటారు. నేను తినే ప్రతి మెతుకుపైనా మా ముగ్గురి మావయ్యల పేర్లు ఉంటాయి.
మా ఫ్యామిలీకి చిరంజీవి, పవన్‌ మావయ్యలు ఎలా జవాన్లుగా నిలబడ్డారో, నేను కూడా వాళ్ళ ఇంటి ముందు జవాన్‌గా నిలబడటానికి సిద్ధంగా ఉన్నా. ప్రతి ఫ్యామిలీకి తప్పకుండా ఓ జవాన్‌ అండగా ఉంటాడు. ఈ సినిమా అలాంటి జవాన్లను ఆధారంగా చేసుకుని చేశాం. నిర్మాత కృష్ణ చాలా మంచి వ్యక్తి. మేకింగ్‌లో ఎక్కడా రాజీపడలేదు. థమన్‌ మంచి పాటల్ని, చక్కటి రీ-రికార్డింగ్‌ అందించారు. ఇటీవలే సినిమా చూసి థ్రిల్‌ అయ్యాను. ప్రసన్న వంటి సీనియర్‌ ఆర్టిస్టుతో నటించడం చాలా ఆనందంగా అనిపించింది. నాకు బ్రదర్‌లాగా బాగా సపోర్ట్‌ చేశారు. గోల్డెన్‌ లెగ్‌గా పేరు తెచ్చుకున్న మెహరీన్‌ కూడా ఈ చిత్రంలో నటించడం చాలా హ్యాపీ ఉంది. ఈ టైటిల్‌ పెట్టగానే చాలా బాధ్యతగా ఫీలై చేశాను. డిసెంబర్‌ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని తప్పకుండా అందరు ఆదరించాలని కోరుకుంటున్నా. ఈ సినిమా మంచి విజయం సాధించి, నా కెరీర్‌కు దోహదపడుతుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు. 
'2015లో తేజ్‌కి ఈ కథ చెప్పా. అప్పుడే చేస్తానని చెప్పారు. సినిమా కోసం సాయి పూర్తిగా సహకరించారు. నేను ఎంతో నిజాయితీతో, నిక్కచ్చిగా తయారు చేసుకున్న పాత్ర ఇది. అంతే నిజాయితీగా తేజ్‌ కష్టపడ్డాడు. ఇంటికో జవాన్‌ ఉండాలని చెప్పే చిత్రమిది. కృష్ణగారి సహకారం మర్చిపోలేను. సినిమాకు దిల్‌రాజు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. థమన్‌ ట్యూన్‌లే కాదు, ఆర్‌.ఆర్‌ కూడా బాగా ఇచ్చాడు. కచ్చితంగా సినిమా అందరిని ఆకట్టుకుంటుంది' అని బి.వి.ఎస్‌.రవి తెలిపారు. ఈ వేడుకలో దిల్‌రాజు, హరీష్‌ శంకర్‌, ప్రసన్న, బాబీ, కరుణాకర్‌, మారుతి, విజయేంద్రప్రసాద్‌, సతీష్‌ వేగేశ్న, డి.వి.వి.దానయ్య తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com