మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌ కు ఇవాంకా

- November 27, 2017 , by Maagulf
మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌ కు ఇవాంకా

ఇవాంకా ట్రంప్ మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో అడుగు పెట్టనున్నారు. GES సదస్సుకు హాజరయ్యేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని ట్వీట్ చేసిన ఇవాంకా... సదస్సుకు ఎవరెవరు వస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్స్ సమ్మిట్‌లో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలపై గ్రాఫిక్ ప్రెజంటేషన్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

సమ్మిళిత వృద్ధికే కాకుండా ఆర్థిక అవకాశాలను పెంపొందించుకునేందుకు భారత్‌, అమెరికా కలిసి పని చేయనున్నట్టు ఇవాంకా తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను మరోసారి కలుసుకునేందుకు తాను ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ సమ్మిట్‌ ఆలోచనలను పంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆమె అన్నారు. ఆంట్రప్రెన్యూర్స్‌కి మరింత సాధికారతను కల్పించి వారి ఆలోచనలను తదుపరి దశకు తీసుకువెళ్లేందుకు GES సదస్సు ‌ ఉపయోగపడుతుందని ఇవాంకా అంటున్నారు. భారత్‌, అమెరికా మధ్య బలమైన ఆర్థిక , రక్షణ భాగస్వామ్యాలను GES ‌ ప్రతిబింబిస్తోందన్నారు. ఇంత భారీ స్థాయిలో ఇంతకుముందెన్నడూ GES సదస్సులో మహిళలు పాల్గొనలేదని తెలిపారు. 

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు విశిష్ట అతిథిగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీ, ఫలక్‌నుమా రెండు చోట్ల మాత్రమే పర్యటించే అవకాశం ఉంది. ఇవాంకా మంగళవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెస్టిన్‌ హోటల్‌కు వెళ్లి... అక్కడి నుంచి హెచ్‌ఐసీసీలో జరిగే జీఈఎస్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం తాజ్‌ ఫలక్‌నుమాలో విందుకు హాజరవుతారు. ఇవాంకా బుధవారం సాయంత్రం వరకు హైదరాబాద్ నగరంలోనే ఉండనున్నారు. 

హైదరాబాద్‌లో ఇవాంకాకు భారీ బహుమతులు రెడీగా ఉన్నాయి. అమెరికాలో ఇవాంకా ధరించే దుస్తులకు ఒక క్రేజ్‌ ఉంది. వృత్తిరీత్యా డిజైనర్‌ అయిన ఇవాంకాకు స్టైలిష్ బ్రాండ్‌ ఉంది. సాధారణంగా ఇవాంకా ఎప్పుడూ అమెరికన్‌ డిజైనర్లు రూపొందించిన దుస్తులనే ధరిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో గతంలో ఆమెపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఇటీవల జపాన్‌లో జరిగిన వరల్డ్‌ అసెంబ్లీ ఆఫ్‌ ఉమెన్‌ అనే సదస్సులో జపాన్‌ సంప్రదాయ దుస్తులు ధరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో చీర కడతారా అన్న చర్చ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో నడుస్తోంది. 

ఇవాంకా ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి సంప్రదాయ దుస్తులను ధరించటం అదే తొలిసారి. జపాన్‌ తర్వాత ఆమె భారత్‌కే వస్తున్నారు. తొలి సారి హైదరాబాద్‌కు వస్తున్న ఆమెకు బహుకరించటానికి తెలంగాణ ప్రభుత్వం- ప్రత్యేకంగా ఒక పోచంపల్లి పట్టుచీరను నేయించింది. అటు సిద్ధిపేట స్పెషల్ గొల్లభామ చీర చీరనూ సిద్ధం చేశారు. ఇవాంకాకు ప్రధాని మోడీ ఇచ్చే విందులో ఈ చీరను ఇవాంకా ధరించే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com