విమానం ల్యాండింగ్ లో జరిగిన గందరగోళం

- December 05, 2017 , by Maagulf
విమానం ల్యాండింగ్ లో జరిగిన గందరగోళం

ముంబయి: ఒక విమానాశ్రయంలో దిగాల్సిన విమానం పొరబాటుగా మరో విమానాశ్రయం వైపు దారిమళ్లింది. ఎయిర్‌పోర్టు సిబ్బంది పైలట్‌ను వెంటనే అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టు రన్‌వే, జుహూ ఎయిర్‌పోర్టు రన్‌వే దాదాపు కిలోమీటర్‌ దూరంలో ఉంటాయి. వీటిపై ముంబయి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది పైలట్లను ఎప్పుడూ అప్రమత్తం చేస్తుంటారు. ముంబయి రన్‌వే కంటే జుహూ రన్‌వే చాలా చిన్నదిగా ఉంటుంది. దీంతో పెద్ద విమానాలు దీనిపై దిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ముంబయి చేరుకుంది. విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో పైలట్‌ ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులతో సంప్రదింపులు జరిపాడు. వారు రన్‌వే 09ని కేటాయించారు. అయితే ముంబయి ఎయిర్‌పోర్టుకు సమీపిస్తున్న సమయంలో పైలట్‌ పొరపాటున జుహూ రన్‌వేని చూసి అటువైపు విమానాన్ని దారి మళ్లించాడు. ఆ ఎయిర్‌పోర్టుకు విమానం చేరుకుంటుండగా ఎయిర్‌ట్రాఫిక్‌ సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. అనంతరం విమానాన్ని తిరిగి ముంబయి రన్‌వేపైకి పైలట్‌ తీసుకువచ్చాడు.

ఆ విమానం సురక్షితంగా రన్‌వేపై దిగింది. దీంతో ప్రమాదం తప్పిందని ఎయిర్‌పోర్టు సిబ్బంది పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. 1953 జులై 15న ముంబయి ఎయిర్‌పోర్టుకు బదులు ఓ విమానం జుహూ ఎయిర్‌పోర్టులో దిగింది.

1972లో జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం ఇదే మాదిరిగా ల్యాండ్‌ అయింది. చిన్న రన్‌వేపై దిగడంతో ఆ విమానాలు దెబ్బతిన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com