ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాo--నరేంద్రమోడీ

- November 15, 2015 , by Maagulf
ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాo--నరేంద్రమోడీ

ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌-సిరియా(ఐఎస్‌ఐఎస్‌) పేరుతో మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదుల్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రయత్నాలను మరిన్ని రెట్లు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామంటూ భారత ప్రధాని నరేంద్రమోడీ సహా పలు దేశాధినేతలూ ప్రతినబూనారు. రెండ్రోజుల పాటు జరిగే జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం ఆదివారం ఆంటల్యాలో ప్రారంభమైంది. దేశాధినేతలు ప్రధానంగా ఉగ్రవాదంపై చర్చించారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి, వాతావరణ మార్పుల గురించి ఈ సమావేశంలో చర్చించాల్సి ఉండగా పారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రధాన చర్చ ఆ అంశంపైనే సాగింది. 'ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రపంచం మొత్తం ఏకం కావాలి. దీనికంటే ముఖ్యమైన అంశం మనకు ఇంకొకటి లేదు. ఇదే మన ప్రాధాన్య అంశం కావాలి' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. షరతులు, శషభిషలు లేకుండా ఉగ్రవాదం నిరోధానికి అంతర్జాతీయ సంస్థను ఒకదానిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు జీ20, బ్రిక్స్‌ దేశాధినేతలు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. పారిస్‌ దాడులకు పాల్పడినవారిని వేటాడడంలో ఫ్రాన్స్‌కు బాసటగా నిలుస్తామని చెప్పారు. వక్రీకరించిన సిద్ధాంతం ఆధారంగా అమాయకుల్ని హతమార్చడమంటే అది ఒక ఫ్రాన్స్‌పైనో, టర్కీపైనో కాకుండా నాగరిక ప్రపంచంపైనే జరిగిన దాడిగా భావించాలని ఉద్ఘాటించారు. అలాంటి దుండగుల్ని పూర్తిగా ఏరివేస్తామని తేల్చి చెప్పారు. శిఖరాగ్ర సదస్సుకు వచ్చిన టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ టయిప్‌ ఎర్డోగన్‌ సహా పలువురు దేశాధినేతలతో ఒబామా సమావేశమయ్యారు. ఈ శిఖరాగ్ర సదస్సులో ఆర్థికాంశాలను చర్చించడం ఆనవాయితీ అయినా పారిస్‌లో భయానక ఉగ్రదాడుల నేపథ్యంలో వాటిపై మాట్లాడుతున్నామని చెప్పారు. ఉగ్రవాద ముప్పును సమర్థంగా ఎదుర్కోవడంపై సంయుక్త ప్రయత్నాలకు తామెప్పుడూ అనుకూలమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయ సమాజంతో మరింతగా కలిసి పనిచేస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ చెప్పారు. ఐసిస్‌పై సమన్వయంతో చర్య చేపట్టడమే అందరి లక్ష్యం కావాలని ఈయూ అధ్యక్షుడు డోనాల్డ్‌ టస్క్‌ పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com