రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలి సీడబ్ల్యూసీ భేటీ..

- December 22, 2017 , by Maagulf
రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలి సీడబ్ల్యూసీ భేటీ..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన శుక్రవారం తొలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే కావడంతో పార్టీ నేతల్లో సరికొత్త ఉత్సాహం తొంగిచూస్తోంది.

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కొనసాగుతున్న ఈ సమావేశానికి సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌తోపాటు పార్టీ సీనియర్ నేత మోతీలాల్ ఓరా, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, అంబికా సోనితోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో చర్చ ప్రధానంగా.. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తీర్పు, పార్లమెంట్ సమావేశాలు తదితర అంశాలపై జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు సమావేశంలో రాహుల్, సోనియా, మన్మోహన్ లకు ఇతర సీడబ్ల్యూసీ సభ్యులు పుష్పగుచ్ఛాలతో ఆహ్వానం పాలికారు. హోరాహోరీగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి సమీపం వరకూ రావడంపై చర్చ జరగనుంది.

అలాగే యూపీఏ హయాంలో చోటుచేసుకున్న 2జీ కేసులో తీర్పు నైతికంగా యూపీఏకు బలం చేకూర్చిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీని వచ్చే ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సి వ్యూహంతో పాటు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com