ఏపీలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న రాష్ట్రపతి

- December 26, 2017 , by Maagulf
ఏపీలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న రాష్ట్రపతి

గ్రామీణప్రాంతాల్లో సైతం అత్యంత శక్తిమంతమైన ఇంటర్నెట్‌ సేవలను అందించడమే ఫైబర్‌ గ్రిడ్‌ ఉద్దేశం. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్‌, టెలివిజన్‌, టెలిఫోన్‌ సేవలను 149 రూపాయలకే అందించబోతోంది ఏపీ ప్రభుత్వం. 250 పైగా ఛానెల్స్‌ను ప్రజలు వీక్షించే అవకాశముంది. ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించేందుకు వైర్‌లెస్‌ టెక్నాలజీని ఉపయోగిస్తారు. కేబుళ్ల అవసరమే లేకుండా.. విద్యుత్‌ కిరణాలతో ఇది పని చేస్తుంది. విద్యుత్‌ కిరణాల ద్వారా సెకనుకు 20 జీబీ వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఫైబర్‌గ్రిడ్‌లో భాగంగా ప్రతి 20 కిలోమీటర్లకు ఒక రూఫ్‌టాప్‌ బాక్స్‌ను ఏర్పాటుచేస్తారు. కేబుల్‌ వ్యవస్థ లేని ప్రాంతాల్లో రెండు వేల బాక్స్‌లు పెడతారు. వాటి ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందిస్తారు. ఇవి సెల్‌ఫోన్‌ ఆపరేటర్లకు సైతం ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా 5.3 కోట్లు కాగా... వారిలో 1.5 కోట్ల మంది హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. మిగతా 1.2 కోట్ల మందికి ఎలాంటి అవాంతరాలు లేకుండా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించడమే లక్ష్యంగా... గూగుల్ ఎక్స్‌తో కలిసి ప్రభుత్వం ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ చేపట్టింది.

ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం... శరవేగంగా పనులను పూర్తి చేసింది. 2015 జూలైలో టెండర్లు పిలిచి దశలవారీగా పనులు చేపట్టింది. మొదటిదశలో కేవలం 9 నెలల్లోనే 24 వేల కిలోమీటర్లకు పైగా ఫైబర్‌ వేయడంతో పాటు లక్షకు పైగా ఇళ్లకు... 1300 పాఠశాలలకు... 1500 ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్షన్లు ఇచ్చారు. రాష్ట్రంలోని 18 వేలకు పైగా సీసీ కెమెరాలను ఏపీ ఫైబర్‌ ప్రాజెక్టుకు అనుసంధానం చేవారు. అతి తక్కువ ధరకే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంటర్నెట్‌ అందించడం వల్ల... విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాంతాలవారీగా సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు... ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఫైబర్‌గ్రిడ్‌ ఛానల్‌ ఉపయోగపడుతుందన్నారు.

మరోవైపు... 2019 మార్చి నాటికి ఫైబర్‌గ్రిడ్‌ రెండో దశను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో నెట్‌వర్క్‌ లేని పంచాయతీలకు కూడా 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఫైబర్‌గ్రిడ్‌ సేవలను అందించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 4వేలకు పైగా పాఠశాలల్లో వర్చువల్‌ తరగతి గదులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఈ ఫైబర్‌గ్రిడ్‌ ఉపయోగంలోకి రావటంతో మరిన్ని పాఠశాలల్లో టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com