ఎన్నారై పాలసీ కోసం ఏడాదిగా ఎదిరిచూస్తున్న ప్రవాసీలు

- December 29, 2017 , by Maagulf
ఎన్నారై పాలసీ కోసం ఏడాదిగా ఎదిరిచూస్తున్న ప్రవాసీలు

* ప్రవాసీ విధాన ప్రకటనపై ఊరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం 

ప్రవాసీల రక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్న ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) కోసం రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయులు, ముఖ్యంగా గల్ఫ్ వలసకార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదిరి చూస్తున్నారు. 'తెలంగాణ ప్రవాసుల సంక్షేమం' పేరిట 2014 లో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక  పేజీ నెం.22 లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఎన్నారై మంత్రి కె. తారక రామారావు అధ్యక్షతన 27 జులై 2016న హైదరాబాద్ లో విస్తృతస్థాయి ఎన్నారై పాలసీ సమావేశం జరిగింది.  ముసాయిదా పత్రం (డ్రాఫ్ట్ కాపీ) రూపొందించి జిఎడి (సాధారణ పరిపాలన శాఖ), హోమ్, పరిశ్రమలు, ఐటి, కార్మిక ఉపాధి, ఆర్ధిక, నైపుణ్య అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక, టాంకామ్ తదితర శాఖలకు పంపించి ఆయాశాఖల సూచనలను పరిగణలోకి తీసుకొని తుది ముసాయిదాను ఏడాది క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు. ఇక మంత్రి మండలి ఆమోదం పొందడమే తరువాయి అని ఏడాదిగా తెలంగాణ ప్రవాసీలోకం ఎదిరిచూస్తోంది. విదేశాలకు వలసవెళ్లే కూలీలు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు, అనుసరించే వైఖరిని ఒక సమగ్రమైన రూపంలో తెలిపేదే ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం). అసలు ఎన్నారై పాలసీ ఏవిధంగా ఉండబోతుంది, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసీల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ పరంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. 

ఎన్నారై పాలసీ లో ఏమున్నది ?
ప్రతిపాదిత ప్రవాసీ సంక్షేమం: గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు. కేంద్ర ప్రభుత్వ 'ముద్ర' పథకంతో అనుసంధానం. బ్లూ కాలర్ వర్కర్స్ (అల్పాదాయ కార్మికులు) ను ఆదుకోవడానికి 'తెలంగాణ స్టేట్ ఎన్నారై వెల్ఫేర్ ఫండ్' (తెలంగాణ రాష్ట్ర ప్రవాస భారతీయుల సంక్షేమ నిధి) ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రభుత్వం, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు తదితరుల నుండి విరాళాలు సేకరించి ఈ నిధికి జమచేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో లబ్దిపొందని పేద కార్మికులను ఆదుకోవడానికి, ఎక్స్ గ్రేషియా (మృతధన  సహాయం) చెల్లించడానికి ఈ నిధిని వినియోగిస్తారు. విదేశాల్లో మరణించినవారి శవపేటికలను హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి వారి స్వగ్రామాల వరకు రవాణాకై ఉచిత అంబులెన్సు సౌకర్యం. రేషన్ కార్డుల నిబంధన లేకుండా అందరికీ వర్తింపు. జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం. హైదరాబాద్ లో ఎన్నారై భవన్ ఏర్పాటు. గల్ఫ్ నుండి వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన. కొత్తగా వ్యాపారాలు, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి మార్జిన్ మనీ, రుణ సౌకర్యం కల్పించడం. తెల్ల రేషన్ కార్డులు. ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ రుణాలు, గృహనిర్మాణం వంటి పథకాల వర్తింపుకు చర్యలు. 24 గంటల హెల్ప్ లైన్ (సహాయ కేంద్రం). విదేశాల్లో ఉన్న వలసకార్మికులు, ఉద్యోగులు, వృత్తినిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కొరకు 'ప్రవాసి తెలంగాణ' వెబ్ పోర్టల్ ఏర్పాటు. ధనవంతులైన ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహం. సంక్షేమానికి తగిన బడ్జెట్ కేటాయింపులు. 

ప్రవాసి తెలంగాణ దివస్
ప్రవాస తెలంగాణీయులకు ఒక వేదిక కల్పించడానికి, రాష్ట్రంతో బంధం ఏర్పరచడానిక వార్షిక ప్రవాసి వేడుకను నిర్వహించడానికి 'ప్రవాసి తెలంగాణ దివస్' ను జరుపుతారు. తెలంగాణ ఎన్నారైల సమస్యలను చర్చించడానికి, వారిని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వివిధ రంగాలలో సేవలందించిన తెలంగాణ ఎన్నారైలకు 'ఉత్తమ తెలంగాణ ప్రవాసి' అవార్డులను ప్రధానం చేస్తారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా పర్యాటక, సాంస్కృతిక శాఖలు పలు కార్యక్రమాలను చేపడతారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ ఇన్వెస్టుమెంట్ సమ్మిట్ (పెట్టుబడుల సమావేశం) ఏర్పాటు చేస్తుంది. 

తెలంగాణ ఎన్నారై కౌన్సిల్
ముఖ్యమంత్రి చైర్మన్ గా అత్యున్నత స్థాయి వ్యవస్థ 'తెలంగాణ ఎన్నారై కౌన్సిల్' (తెలంగాణ ప్రవాస భారతీయుల మండలి) ఏర్పాటు చేయనున్నారు.ప్రవాసుల సంక్షేమం గురించి ప్రభుత్వ విధానాలపై అన్ని విధాలా మార్గదర్శనం చేయడం, 'సెంటా' ద్వారా అమలుచేయబడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షణ చేయడం, సమీక్షించడం, 'ప్రవాసీ తెలంగాణ దివస్' నిర్వహణను పరిశీలించడం ఈ కౌన్సిల్ యొక్క ముఖ్యమైన విధులు.  ఎన్నారై మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు. ప్రవాసి తెలంగాణా సంఘాల ప్రతినిధుల (జనాభానుబట్టి 1-3 ముగ్గురు) ను సభ్యులుగా తీసుకుంటారు. సంబంధిత శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 'సెంటా' సిఇఓ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, నిపుణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల ప్రతినిధులను కూడా సభ్యులుగా చేర్చాలనే సూచనలు ఉన్నాయి. 

సెంటా
'సెంటా' (సెంటర్ ఫర్ నాన్ రెసిడెంట్ తెలంగానైట్స్ అఫేర్స్) అంటే.. తెలంగాణా ప్రవాస భారతీయుల వ్యవహారాల కేంద్రం. 'సెంటా' కు ఎన్నారై మంత్రి ప్రభుత్వ అధినేతగా, ప్రభుత్వ అధికారి అయిన సిఇఓ పరిపాలన అధినేతగా  వ్యవహరిస్తారు. ఈ కేంద్రం ఎన్నారైల సమస్యలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయము చేస్తూ ఒక కార్యనిర్వాహక సంస్థగా పనిచేస్తుంది. 'తెలంగాణ ఎన్నారై కౌన్సిల్' మార్గదర్శనంలో ప్రవాసీల సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం కొరకు సమన్వయము చేయడము. అవసరమైన సమయాలలో ప్రవాసీల సంక్షేమానికి పాలనాపరమైన చర్యలు తీసుకోవడం. ప్రవాసీలు గణాంకాలు (డేటా బేస్) తయారుచేయడం, నిర్వహించడం. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ మిషన్ తో సమన్వయ చేస్తూ ప్రవాసులకు నైపుణ్య అభివృద్ధి, నవీకరణ కార్యక్రమాలు చేపట్టడం. విదేశీ ఉద్యోగాల కల్పనా సంస్థ 'తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకామ్) ను బలోపేతం చేయడం. 

డి-సెంటా 
'డి-సెంటా' (డిస్ట్రిక్ట్ సెంటర్ ఫర్ నాన్ రెసిడెంట్ తెలంగానైట్స్ అఫేర్స్) అంటే.. తెలంగాణా ప్రవాస భారతీయుల వ్యవహారాల జిల్లా కేంద్రం. రిక్రూటింగ్ ఏజెన్సీలపై దృష్టిపెట్టడం. అంతర్జాతీయ వలసలపై సమాచార వ్యాప్తి, అవగాహన కలిగించడం. కౌన్సిలింగ్, సలహాలు.  'ప్రి డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రేనింగ్' - పిడిఓటి (ప్రయాణ ముందస్తు అవగాహనా శిక్షణ) నిర్వహించడం. గణాంకాలు (డేటా బేస్) నిర్వహించడం లాంటి ముఖ్యమైన బాధ్యతలు చేపడుతుంది. 'డి-సెంటా' కు జిల్లా కలెక్టర్ అధినేతగా ఉంటారు. జిల్లా కార్మిక సంక్షేమ అధికారి జనరల్ మేనేజర్ గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, కార్మిక,  ఉపాధి కల్పన శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా పోలీసు అధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సీనియర్ గల్ఫ్ రిటర్నీలు, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల ప్రతినిధులను కూడా సభ్యులుగా చేరిస్తే బాగుంటుంది. 

మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు 
93944 22622 [email protected]    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com