రివ్యూ: 2 కంట్రీస్‌

- December 29, 2017 , by Maagulf
రివ్యూ: 2 కంట్రీస్‌

చిత్రం: 2 కంట్రీస్‌ 
నటీనటులు: సునీల్‌.. మనీషారాజ్‌.. సంజన.. రాజారవీంద్ర.. శ్రీనివాస్‌రెడ్డి.. పృథ్వీ తదితరులు 
సంగీతం: గోపి సుందర్‌ 
ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌ 
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరావు 
నిర్మాత: ఎన్‌.శంకర్‌ 
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌.శంకర్‌ 
సంస్థ: మహాలక్ష్మి ఆర్ట్స్‌ 
విడుదల తేదీ: 29-12-2017
సునీల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమంటే కాసేపు హాయిగా నవ్వుకోవచ్చని ప్రతీ ప్రేక్షకుడు ఆశిస్తాడు. అందుకు తగ్గట్టుగానే ఆయన కథల ఎంపిక, చిత్రాలు ఉంటాయి. అయితే హాస్యనటుడిగా అద్భుతమైన పాత్రల్లో అలరించిన సునీల్‌ కథానాయకుడిగా మారేసరికి కమర్షియల్‌ హంగుల చట్రంలో బిగిసిపోక తప్పలేదు. అయినా, తనదైన టైమింగ్‌తో నవ్వులు పంచుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'ఉంగరాల రాంబాబు' అంటూ ప్రేక్షకులను పలకరించిన సునీల్‌.. తనకు అచ్చొచ్చిన రీమేక్‌ కథనే మరోసారి ఎంచుకున్నారు. ఎన్‌.శంకర్‌ దర్శకత్వంలో సునీల్‌ నటించిన తాజా చిత్రం '2 కంట్రీస్‌'. మలయాళంలో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. శంకర్‌ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కోసం చూస్తున్న సునీల్‌కు '2 కంట్రీస్‌' ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది? శంకర్‌ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏ మేర ఆకట్టుకుంది?

కథేంటంటే 
డబ్బుకోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పే రకం ఉల్లాస్‌(సునీల్‌). అందుకోసం సొంత కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. ఊళ్లో పటేల్‌(షాయాజి షిండే) కూతురుని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. చివరికి ఆ డబ్బు కోసమే ఆమెను కాదని, అమెరికాలో ఉన్న లయ(మనీషారాజ్‌)కు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటాడు. భార్యతో కలిసి అమెరికాకు వెళ్లాక అతని బండారం ఎలా బయటపడింది. ఉల్లాస్‌-లయ వివాహం బంధం నిలిచిందా? లేదా? ఉల్లాస్‌ తన భార్య కోసం ఏం చేశాడు..? తన తప్పును ఎలా సరిదిద్దుకున్నాడు అన్నదే కథ!
ఎలా ఉందంటే 
ద్వేషాన్ని ప్రేమతో జయించడమే ఈ కథ. తనని మోసం చేశాడని తెలిశాక భర్తపై ద్వేషం పెంచుకుంటుంది లయ. ఆమె మనసును ఉల్లాస్‌ తన ప్రేమతో ఎలా జయించాడు అన్నదాని చుట్టూ కథను తీర్చిదిద్దారు. మలయాళంలో విజయవంతమైన '2 కంట్రీస్‌'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ కథలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. మాతృక స్థాయిలో ఇందులో ఫీల్‌ పండలేదు. హాస్యం పాళ్లు కూడా తక్కువే. పంచ్‌లు, ప్రాసలతో సంభాషణలు వినిపించినా, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో అవి ఆకట్టుకోలేదు. చాలా చోట్ల లాజిక్‌ లేని సన్నివేశాలు కనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు మాత్రం ఆకట్టుకుంటాయి. సునీల్‌ సినిమా అంటే పంచ్‌లు, ప్రాసలతో నింపేస్తే సరిపోతుందన్న ఆలోచనతో వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు దర్శక-రచయితలు. భావోద్వేగాలకు కథలో ప్రాధాన్యం ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు.

ఎవరెలా చేశారంటే 
సునీల్‌ తనకు అలవాటైన డైలాగ్‌ డెలివరీతోనూ, హావభావాలతోనూ కనిపించాడు. ఆయన నటనలో కొత్తదనమేమీ లేదు. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాల పరంగా పర్వాలేదనిపించారు. మనీషారాజ్‌ అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయిలానే కనిపించింది. అందం పరంగా ఆమెకు మంచి మార్కులు పడతాయి. పృథ్వీ, నరేష్‌, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణభగవాన్‌, చంద్రమోహన్‌ తదితర నటులున్నప్పటికీ వాళ్ల పాత్రలు సినిమాపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. సాంకేతికంగా సినిమా బాగుంది. ఛాయాగ్రహణం, సంగీతంతో పాటు, నిర్మాణ విలువలు సినిమాకు బలాన్ని ఇచ్చాయి. తన శైలికి పూర్తి భిన్నమైన ప్రయత్నం చేసిన ఎన్‌.శంకర్‌ కథపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

బలాలు 
+ ద్వితీయార్ధం 
+ సంగీతం 
+ పతాక సన్నివేశాలు 
+ సునీల్‌ నటన
బలహీనతలు 
- కథ, కథనం 
- హాస్యం పండకపోవడం 
చివరిగా: సునీల్‌ పాత్ర పేరులోనే 'ఉల్లాసం' 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com