పాక్‌ వీసాలను తిరస్కరించిన భారత్‌

- December 30, 2017 , by Maagulf
పాక్‌ వీసాలను తిరస్కరించిన భారత్‌

హజ్రత్‌ ఖ్వాజా నిజాముద్దీన్‌ ఔలియా ఉత్సవాల కోసం వచ్చే పాకిస్థాన్‌ యాత్రికుల వీసాలను భారత్‌ తిరస్కరించిందని పాక్‌ విదేశాంగ శాఖ వర్గాలు శనివారం తెలిపాయి. వచ్చే ఏడాది జనవరి 1వ తేది నుంచి 8వ తేది వరకు దిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గాలో ఉర్సు వేడుకలు జరుగనున్నాయి. ఇందులో పాల్గొనడానికి పాకిస్థాన్‌ నుంచి 192 మంది యాత్రికులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ భారత్‌ వారికి వీసాలను ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో వారి పర్యటనను పాకిస్థాన్‌ చివరినిమిషంలో వాయిదా వేసిందని విదేశాంగ శాఖ అధికారి పేర్కొన్నారు. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా పాకిస్థాన్‌కు చెందిన భక్తులు అత్యంత పవిత్రమైన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారని పాక్‌ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటన 1974 భారత్‌-పాకిస్థాన్‌ ప్రోటోకాల్‌ నిబంధనల ప్రకారం పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా జరుగుతోంది. హజ్రత్‌ నిజాముద్దీన్‌ఔలియా దర్గాలో జరిగే ఉర్సు వేడుకలను రెండు దేశాల మధ్య మత సామరస్యానికి చిహ్నంగా భావిస్తారు. కానీ భారత్‌ ఇందుకోసం వచ్చే పాక్‌ యాత్రికుల వీసాలను తిరస్కరించడం దురదృష్టకరమని ఆ దేశ విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. పాక్‌ జైలులో బందీగా ఉన్న కులభూషణ్‌ యాదవ్‌ను కలిసేందుకు వెళ్లిన అతని తల్లి, భార్య పట్ల అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ యాత్రికుల వీసాల విషయంలో భారత్‌ కఠిన వైఖరి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com