వెండి తెరపై చిత్రంగా అడుగుపెట్టి.. జీవిత తెరనుంచి తప్పుకొన్న ఉదయ్ కిరణ్ వర్ధంతి నేడు
- January 05, 2018
వెండితెరపై చిత్రంగా వచ్చాడు. ఆచిత్రం చెప్పిన కథ పూర్తి కాకుండానే కనుమరుగయ్యాడు. ఎంతో మంది మనసంతా నిండిపోయావు. కానీ నీ మనసును గెలుచుకున్న వారే తగ్గిపోయారు. కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న చోటే ఆత్మాభిమానం దెబ్బతింటుంటే, ఆవేశమో, ఆవేదనో.. తెలియని తనమో.. మొత్తంగా ఊపిరి తీసుకున్నావు. కానీ ఉదయ్.. నీ స్నేహం ఇక రాదు అని తెలిసిన ఎన్ని హృదయాలు బరువెక్కాయో నీకు తెలియదు. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారీ, బాధ కలుగుతుంది.. ఆ తర్వాత చాలా తొందరపడ్డావన్న కోపమూ వస్తుంది.. ఇది నీ నాలుగో వర్ధంతి.. మనిషిగా నువ్వులేవేమో కానీ, మనసంతా నువ్వే ఉన్నావు ఉదయ్..
చిత్రం.. ఈ సినిమాతోనే చిత్రంగా వచ్చాడు ఉదయ్. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా మనసంతా నిండి ఉన్న సినిమాపై ప్రేమతో పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఏం చేయాలన్నా విజయమే కీలకం కదా. ఆ విజయం అతనికి తొలి సినిమాతోనే వచ్చింది. చిత్రంతో ఓవర్ నైట్ యూత్ లో పెద్ద స్టార్ హీరో అయిపోయాడు ఉదయ్. ఇది అతను ఊహించనిది..ఆ మాటకొస్తే సినిమా పరిశ్రమ కూడా ఊహించలేదు. కానీ ఊహించనివి జరగడమే కదా జీవితం. దీంతో ఉదయ్ కిరణ్ అనే పేరు పరిశ్రమ అంతా మార్మోగిపోయింది.
ఒక్క విజయం వస్తేనే ఆకాశంలో విహరిస్తున్నారు చాలామంది. కానీ అండదండలు లేనివాడు కదా.. అందుకే అతని కాళ్లు నేలపైనే ఉన్నాయి. తర్వాత నువ్వు నేను.. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రేమకథలకు కొత్త దారి చూపెట్టిన సినిమా. ఆ సినిమాలోని కథ కంటే ఉదయ్ కిరణ్ నటనే హైలెట్ అయింది.. చీ చీ మీ పెద్దాళ్లున్నారే.. అంటూ ఉదయ్ కిరణ్ అమాయకంగా చెప్పిన డైలాగ్ .. కొన్ని లక్షల మంది హృదయాల్లో నాటుకుపోయింది. ఆ డైలాగ్ తో అబ్బాయిలు ఉదయ్ కి అభిమానులుగా మారితే అమ్మాయిలు ఆరాధించడం మొదలుపెట్టారు.
ఒకేసారి వరుసగా రెండు సూపర్ హిట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆ హీరో క్రేజ్ అమాంతం పెరుగుతుంది. ఉదయ్ కూడా ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేయడానికే అలవాటు పడ్డట్టు కనిపిస్తుంది. అతని మరణానికి కారణాల్లో ఇలాంటివి ఇక్కడ నుంచే ఉన్నాయి కాబట్టే ఇలా చెప్పుకున్నా తప్పు లేదేమో.
హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు కలుసుకోవాలని, హోళీ రెండూ యావరేజ్ కానీ ఎవరికీ నష్టాల్లేవ్. ఆ తర్వాత నీ స్నేహం హిట్... ఉదయ్ మళ్లీ లేస్తున్నాడనుకున్నారు .. కానీ కాస్త ఇబ్బందే అయినా ఇదే అతని చివరి హిట్ అని చెప్పక తప్పదు.
ఇక ఉదయ్ కిరణ్ కు ఫ్లాపులు వరుస కట్టాయి. ఒకదాన్ని మించి మరొకటి. కానీ అతని క్రేజ్ కానీ, అభిమానులు గానీ తగ్గలేదు. ఇదే అతను సంపాదించుకున్న అతి పెద్ద ఆస్తి. ఆ ఆస్తి తరగలేదు కానీ, ఇప్పుడు సినిమా సినిమాకూ అతని ఆత్మవిశ్వాసం తగ్గుతూ వస్తోంది. అది ఎంచుకునే సినిమాలపై మరింత ప్రభావం చూపించింది. కొంతకాలం పాటు కథలు నచ్చితేనే సినిమా అనుకున్న వాడు కాస్తా.. సినిమా వస్తే చాలు అనుకునే స్థాయికి పడిపోయాడు.
చివరికి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అంతకంటే ముందు అతని ఆత్మ ఎంత సంక్షోభం అనుభవించిందో ఎవరికి తెలుసు.. అతనికి తప్ప. నిజమే అతను ఎత్తును చూసి పల్లాలను తట్టుకోలేకపోయాడు. కానీ ఆ ఎత్తుపల్లాల నడుమ అతని కెరీర్ ఊగిసలాడటానికి కారణాలు ఎవరూ పట్టించుకోలేదు.. చివరికి అతని శవం కూడా అనాథైంది. అప్పుడే అతనికి అభిమానం తోడైంది. కోట్లమంది కన్నీరు పెట్టుకుంటే లక్షలమంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. కడసారి చూపు కోసం కన్నీటితో నివాళులర్పించారు. కనీసం ఈ అభిమానం చూడ్డానికైనా ఉదయ్ బతికుంటే బావుండేది.
ఉదయ్ కిరణ్ మరణించి మూడేళ్లు నిండిపోయాయి.. అతని జ్ఞాపకాలు ఎందరిలోనో నిలిచి ఉన్నాయి. ఆ నవ్వులు ఎంతో మంది మనసుల్లో సజీవంగా ఉన్నాయి. అతను తప్పు చేశాడో, ఒప్పు చేశాడో కానీ, ఈ జీవన తెర నుంచి తప్పుకున్నాడు. ఓటమిని తట్టుకోలేక, జీవితాన్ని ఎదుర్కోలేక అంటారు కొందరు. కానీ అసలు విషయం అతనికే తెలుసు.. ఆ కళ్లల్లో కోటి కాంతుల వెలుగులు.. నవ్వుల్లో కొండంత ఆత్మవిశ్వాసం.. నవ్వితే పడే బుగ్గ సొట్టల్లో ఎంతమంది అమ్మాయిల మనసులు నలిగిపోయాయో చెప్పలేం. అతి చిన్న వయసులోనే మోయలేని స్టార్డమ్. అప్పటి వరకూ ఎగిసిపడే అలలా ఉన్నవాడు కాస్తా.. ఎగిసి పడిపోయిన కెరటంలా అయిపోయాడు.. ఆ కెరటం ఇప్పుడు తీరం కూడా దాటిపోయింది. కానీ కళాకారుడికి మరణం లేదు... బుల్లి తెరపై ప్రదర్శించే నీ సినిమాలు చూస్తూ నిన్ను గుర్తు చేసుకొని వారుండరు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







