తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. పల్లెబాట పట్టిన జనం

- January 12, 2018 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. పల్లెబాట పట్టిన జనం

భాగ్యనగరం పల్లెబాట పట్టింది. సంక్రాంతి సెలవులు రావడంతో.. సిటిజన్లు గ్రామాలకు పయనమయ్యారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. అటు టోల్‌గేట్ల దగ్గర భారీ రద్దీ ఏర్పడుతోంది. సంక్రాంతి కోసం నగరవాసులు పల్లెబాట పట్టారు. ఊళ్లకు వెళ్లేవారితో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో టికెట్‌ ధరలు వేలల్లో ఉండడంతో.. దూరప్రాంతాలకు వెళ్లే వాళ్లంతా రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. కనీసం నిల్చోవడానికి కూడా స్థలం లేకపోయినా.. తోసుకుంటూ బోగీల్లోకి ఎక్కేస్తున్నారు. పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 135 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నా అవి ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోవడం లేదు.

అటు హైదరాబాద్‌ నుంచి గ్రామాలకు వెళ్లే వాహనాలతో టోల్‌గేట్లన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. యాదాద్రి చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోవడంతో... ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటరు మేర ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాల రద్దీతో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్‌ అయింది. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రాప్రాంత వాసులంతా ఈ టోల్‌గేట్ మీదుగానే వెళ్లాలి. దీంతో నేషనల్‌ హైవేపై వాహనాలు బారులు తీరాయి. పండుగ కోసం సొంతూళ్లకు పెద్దఎత్తున తరలివెళుతున్నారు. నిన్నటి నుంచే విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. హైదరాబాద్‌ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. కృష్ణా జిల్లాలోని కీసర టోల్‌గేట్‌ దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. దీంతో టోల్‌ప్లాజా దగ్గర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com