నెక్ట్స్ ప్రధాని ఆయనే...!

- January 19, 2018 , by Maagulf
నెక్ట్స్ ప్రధాని ఆయనే...!

2018 ఎన్నికల్లో మళ్లీ NDAదే విజయకేతనమంటూ రిపబ్లిక్‌ టీవీ- సీ ఓటర్స్‌ సర్వే తేల్చింది. ఈసారి NDAకు 335 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 336 స్థానాలు దక్కగా.. ఈసారీ దాదాపు అంతే మెజార్టీ వస్తుందని తెలిపింది. మిత్ర పక్షాలతో కలిసి బీజేపీ.. 41.4శాతం ఓట్లు కొల్లగొడుతుందట. ఇక.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి 89 స్థానాల్లో గెలుస్తోందంటూ సర్వేలో తేలింది. 2014లో కాంగ్రెస్‌కు 60 సీట్లు రాగా.. 2018లో మరో 30 సీట్లు పెరగనున్నాయని సర్వే తెలిపింది. మోడీనే మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత మోడీ క్రేజ్‌ తగ్గిందంటూ విపక్షాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభ వెలవెలపోతోందంటూ కాంగ్రెస్ ఊదరగొడుతోంది. కానీ.. ప్రజల అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. మోడీయే బెటర్‌ అంటూ సర్వేలో 62శాతం మంది అభిప్రాయపడ్డారు. 

కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టాక రాహుల్‌ మాంచి దూకుడు మీదున్నారు. మోడీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ట్వీట్లతోనూ అదరగొడుతున్నారు. గుళ్లూ, గోపురాలూ తిరుగుతున్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి.. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఓడినా.. గెలిచినంత పని చేశారు. మరి.. రాహుల్‌ ఇదే జోరు కొనసాగిస్తే.. 2018 నాటికి ప్రధాని పీఠానికి చేరువవుతారా? అంటే.. అంత సీన్ లేదని రిపబ్లిక్‌ టీవీ- సీ ఓటర్స్‌ సర్వే అంటోంది. కేవలం 12.6 శాతం మంది మాత్రమే రాహుల్‌ ప్రధాని కావాలని కోరుకున్నారు. 

బీజేపీకి గట్టి పట్టున్న గుజరాత్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లో బీజేపీదే హవా కనిపిస్తున్నా.. సీట్ల సంఖ్య మాత్రం స్వల్పంగా తగ్గుతుందని సర్వేలో తేలింది. ఇక.. 2014లో ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ సీట్లకు కోత పడుతుందని అంచనా. యూపీలో 80 స్థానాలుండగా బీజేపీ 60 సీట్లు గెలుచుకుంటుందని.. యూపీఏ 18 స్థానాలు దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. 

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో మాత్రం 2018 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏదే హవా. పంజాబ్‌లో యూపీఏకు 9 సీట్లు వస్తాయని.. ఎన్డీయే 2  స్థానాలకే పరిమితమవుతుందని సర్వేలో అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తోంది. కన్నడ నాట యూపీఏకు 5 సీట్లు.. ఎన్డీయేకు 22 సీట్లు వస్తాయని రిపబ్లిక్‌ టీవీ- సీ ఓటర్స్‌ సర్వేలో తేలింది. మహారాష్ట్రలోనూ ఎన్డీయేదే హవా. 48 సీట్లకు గాను 44 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులకే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలో తేలింది. కాంగ్రెస్‌, ఎన్సీపీలు చెరో రెండు స్థానాలు దక్కించుకోనున్నాయి. ఒకవేళ కాంగ్రెస్‌-ఎన్సీపీ కలిసి పోటీ చేస్తే కనుక.. ఎన్డీయే మెజార్టీ కాస్త తగ్గి 35 సీట్లు ఖాతాలో వేసుకోనుంది. శివసేన సొంతంగా బరిలో దిగితే.. ఎన్డీయే స్థానాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని రిపబ్లిక్‌ టీవీ- సీ ఓటర్స్‌ సర్వేలో స్పష్టమైంది. 

ఒడిశాలో అనూహ్యంగా బీజేపీ బలపడుతోంది. ఒడిశాలో ఏకంగా 13 స్థానాల్లో కమల వికాసం కనబడుతోంది. అటు.. బెంగాల్‌లోనూ బీజేపీ భారీగా పుంజుకుంటోంది. 42 సీట్లకు గాను.. 12 స్థానాలు కమలం పార్టీ కైవసం చేసుకుంటుందని రిపబ్లిక్‌ టీవీ- సీ ఓటర్స్‌ సర్వే తెలిపింది. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ 29 సీట్లలో గెలుస్తుందని అంచనా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com