ప్రభాత సూర్యుడి పుట్టినరోజు పండుగ 'రథసప్తమి'

- January 23, 2018 , by Maagulf
ప్రభాత సూర్యుడి పుట్టినరోజు పండుగ 'రథసప్తమి'

ఈ నెల 24న రథసప్తమి సందర్భంగా తర,తమ బేధాలు లేకుండా అందరికీ సమానంగా వెలుగులు పంచే, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్యదేవుడి గురించిన సమాచారం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం... ప్రకృతిలోని జంతు జాలం, వ‌ృక్షసంపద, మనిషి మనుగడ సాగిస్తున్నాడంటే దానికి కారణం ఆ సూర్య భగవానుడే. ఒక్క రోజు మబ్బుల చాటున దాక్కుని రానని మొరాయించాడంటే అన్నింటిలో, అందరిలో ఉత్సాహం నీరుగారి పోతుంది. ప్రతి రోజు ఆ వెచ్చని కిరణాలు మేనుని తాకితే పనులు చకచకా జరిగిపోతాయి. మనుషుల్లానే సూర్యుడికి కూడా కోపం, శాంతం వంటి గుణాలున్నాయి. మనకి ప్రతి క్షణానికీ మారితే సూర్యుడు నెలకోసారి మాత్రమే తన ప్రతాపం చూపిస్తాడట. 

ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 మంది సూర్యులు ఉన్నారు. తెలుగు నెలల ప్రకారం ఒక్కో నెలలో ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. అవేంటో చూద్దాం..

చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత అయితే వైశాఖంలో అర్యముడు
జ్యేష్టంలో మిత్రుడు, ఆషాఢంలో వరుణుడు
శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో వివస్వంతుడు
ఆశ్వయుజంలో త్వష్ణ, కార్తీకంలో విష్ణువు
మార్గశిరంలో అంశుమంతుడు, పుష్యంలో భగుడు, 
మాఘంలో పూషుడు, ఫాల్గుణంలో పర్జజన్యుడు

భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. అయితే ఆ కిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలుగా అంచనా వేశారు ఖగోళ శాస్త్రజ్ఞులు. సూర్యకాంతి సప్త వర్ణాల కలయికగా వైజ్ఞానికులు చెబుతుంటారు. మరోపక్క ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది. 

మరి ఏడు గుర్రాల పేర్లు 1. గాయత్రి 2. త్రిష్ణుప్పు 3. అనుష్టుప్పు 4. జగతి 5. పంక్తి 6. బృహతి 7. ఉష్ణిక్కు.  

ఈ గుర్రాల రూపాలు కూడా ఏడు రంగులకు సరిగ్గా సరిపోతాయట. సూర్యుని రథానికి ఇరుపక్కల ఉన్న చక్రాలు కూడా ఒకటి పగలుని సూచిస్తే, ఒకటి రాత్రిని సూచిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ఈ చక్రంలో ఉన్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకగా చెబుతారు. 
లోకసాక్షి అయిన ఆ సూర్యభగవానుని అర్పించి ఆయన కరుణా కటాక్షములను పొందే సుదినమే రథసప్తమి. ఈ రోజు రామాయణంలోని ఆదిత్య హృదయం చదివితే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం బ్రహ్మగా, మద్యాహ్నం ఈశ్వరునిగా, సాయింత్రం విష్ణు రూపుడిగా ఉంటాడు. త్రిసంద్యలలో మనం సూర్య దేవుడిని ప్రార్దిస్తే త్రిమూర్తులను పూజ చేసినంత ఫలితం ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com