అట్టుడుకుతున్న కాశ్మీర్: ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు పౌరుల మృతి

- January 28, 2018 , by Maagulf
అట్టుడుకుతున్న కాశ్మీర్: ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు పౌరుల మృతి

శ్రీనగర్: వేర్పాటువాదులు బంద్‌ను తలపెట్టడంతో ఆదివారం కాశ్మీర్‌లో ఉద్రిక్తత నెలకొంది. సైన్యం కాల్పుల్లో జమ్ము కాశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో శనివారం సాయంత్రం ఇద్దరు పౌరులు మరణించారు.

పౌరుల మృతికి నిరసనగా వేర్పాటువాదు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. ఆత్మరక్షణ కోసమే తాము కాల్పులు జరిపామని సైన్యం చెబుతోంది.

ఏ మాత్రం రెచ్చగొట్టకుండానే ఓ గుంపు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వడం ప్రారంభించిందని, దాంతో తాము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని అంటోంది. సంఘటనలో పాలు పంచుకున్న సైనికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విచారణకు ఆదేశించారు.

ఆమె రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడారు. సంఘటనపై నిర్మలా సీతారామన్ వివరమైన నివేదిక కోరినట్లు సమాచారం.

బంద్ నేపథ్యంలో శ్రీనగర్‌లో కర్ఫ్యూ విధించారు. కాశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో దుకాణాలను, వ్యాపార సంస్థలను మూసేశారు. ప్రభుత్వ రవాణా స్తంభించింది. బారాముల్లా బనిహాల్ మధ్య రైళ్ల రాకపోకలను ఆపేశారు.

పుల్వామా, అనంతనాగ్, కుల్గామ్, సోపిన్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. నిరసనకారులను వెంటాడుతూ సైన్యం జరిపిన కాల్పుల్లో జావేద్ అహ్మద్ భట్ (20) సుహైల్ జావిద్ లోనే (24) అనే ఇద్దరు యువకులు శనివారం సాయంత్రం మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com