కేంబ్రిడ్జ్‌ స్కాండల్‌ : ఫేస్‌బుక్‌ యూజర్లకు నోటీసులు

- April 08, 2018 , by Maagulf
కేంబ్రిడ్జ్‌ స్కాండల్‌ : ఫేస్‌బుక్‌ యూజర్లకు నోటీసులు

న్యూఢిల్లీ : కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌లో మీ ఫేస్‌బుక్‌ డేటా చోరికి గురైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి. నేటి నుంచే కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌లో ప్రభావితమైన 8.7 కోట్ల మంది యూజర్లలో ఎవరెవరో ఉన్నారో ఫేస్‌బుక్‌ తెలియజేస్తుందట. యూజర్ల న్యూస్‌ ఫీడ్స్‌లో ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ తెలియజేస్తుందని తెలిసింది. ఈ స్కాండల్‌లో ప్రభావితమైన యూజర్లలో ఎక్కువ మంది(7 కోట్ల మంది) అమెరికన్లే ఉన్నట్టు ఫేస్‌బుక్‌ ఒప్పుకుంది. మిగతా యూజర్లు ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా, యూకే యూజర్లున్నారని కూడా తెలిపింది. అంతేకాకుండా 5 లక్షల మంది భారతీయుల డేటాను కూడా భారత్‌లో ఎన్నికల సమయంలో, కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు చెందిన సంస్థకు షేర్‌ చేశామని ఫేస్‌బుక్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ప్రభావితమైన యూజర్లకు ఫేస్‌బుక్‌ నోటీసులు పంపబోతోంది. ‘‍ప్రొటెక్టింగ్‌ యువర్‌ ఇన్‌ఫర్మేషన్‌’ పేరుతో ఈ నోటీసులు జారీచేయనుంది. ఏ యాప్స్‌ను వాడారు...ఆ యాప్స్‌తో ఎలాంటి సమాచారాన్ని కేంబ్రిడ్జ్‌ అనలిటికాతో పంచుకున్నాం అని తెలియజేస్తూ.. ఈ నోటీసులు పంపనుంది. ఒకవేళ కావాలనుకుంటే, ఆ యాప్స్‌ను ఫేస్‌బుక్‌ తొలగించేసి, థర్డ్‌ పార్టీ యాక్సస్‌ను పూర్తిగా ఆపివేయనుందని తెలుస్తోంది. 

ఈ స్కాండల్‌తో చరిత్రలోనే అతిపెద్ద గోప్యత సంక్షోభంలో ఫేస్‌బుక్‌ కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్‌కు చెందిన ఈ డేటా మైనింగ్‌ సంస్థతో ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను పంచుకుంది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఫేస్‌బుక్‌ డేటాను భారీ మొత్తంలో ఈ సంస్థ వాడుకుంది. దీంతో ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఎలా ఫేస్‌బుక్‌ డేటాను యూజర్ల అనుమతి లేకుండా షేర్‌ చేశారని యూజర్లు, టెక్‌ వర్గాలు మండిపడుతున్నాయి. తాము అతిపెద్ద తప్పు చేశామని కంపెనీ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా ఒప్పుకున్నారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు, భవిష్యత్తులో యూజర్ల గోప్యత విషయంలో వాగ్దానాలు చేసేందుకు అమెరికన్‌ కాంగ్రెస్‌ ముందుకు కూడా రాబోతున్నారు. ఈ సమయంలో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కఠిన ప్రశ్నలనే ఎదుర్కోబోతున్నారని తెలిసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com