వరదబాధితులకు తారాలోకం సహాయం
- December 03, 2015
భారతదేశంలో ఎక్కడైనా ఎటువంటి విపత్తు సంభవించినా భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న ఆర్తులను ఆదుకునేందుకు తారాలోకమంతా 'మేము సైతం' అంటూ ముందడుగేసి ఇతరులకు సైతం మార్గదర్శకంగా నిలిచిన సందర్భాలెన్నో ఉన్నాయి. సాయం చిన్నదైనా పెద్ద మనసుతో చేయాలని విజ్ఞప్తి చేస్తూ చెన్నై వరద బాధితుల సహాయార్థం తారాలోకమంతా మరోమారు ఏకతాటిపైకి వచ్చింది.. తమకు తోచిన సాయాన్ని చేస్తూ మరికొంత మందికి స్ఫూర్తిదాయంగా నిలుస్తోంది... గత కొన్ని రోజులుగా భారీ వర్షాల ధాటికి చెన్నై, పరిసర ప్రాంతాల్లో జన జీవనం అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విపత్తు చేస్తున్న అంధకారంలో నుంచి చెన్నై వాసులు బయట పడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. నడుం బిగించిన తారా లోకం.. అధికారులతోపాటు మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా ఎంతో మంది తమవంతు సహాయసహకారాల్ని అందిస్తున్న తరుణంలో నిరాశ్రయులైన బాధితులకు చేయూతనివ్వడం కోసం తమిళ తారాలోకం నడుంబిగించింది. వరద బాధితుల సహాయార్థం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పది లక్షల రూపాయల విరాళాన్ని అందించి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. రజనీకాంత్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. రజనీ మాదిరిగానే ఆయన అల్లుడు ధనుష్ 5 లక్షల రూపాయలు, సూర్య, ఆయన సోదరుడు కార్తీ సంయుక్తంగా 25 లక్షల రూపాయలు, విశాల్ 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. వీళ్ళంతా ఈ విరాళాన్ని చెన్నై ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కోసం నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్‌కు అందజేశారు. సూర్య బాటలోనే కెప్టెన్ విజయ్ కాంత్, రాఘవ లారెన్స్, అనిరుధ్, సూర్య శివకుమార్ తదితరులు సైతం తమవంతు సహాయాన్ని అందించారు. వీరి బాటలోనే మరో నటుడు సిద్ధార్థ్ వరద బాధితులకు ఆహారం ప్యాకెట్లు అందించేందుకు ముందుకు రావడంతోపాటు ఎవరైనా ఆహార ప్యాకెట్లు ఇచ్చేందుకు సహాయం చేయదలిస్తే తనను ట్విట్టర్ ద్వారా సంప్రదించగలరని అభిమానులకు, ట్విట్టర్ ఫాలోవర్స్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే కొంతమంది సినీ ప్రముఖులు చెన్నై ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ సామాజిక మీడియా ద్వారా ఆక్షించారు. ఖుష్బు, విశాల్, ఐశ్వర్య ధనుష్, సాయిధరమ్‌తేజ్, లక్ష్మీమీనన్ తదితరులు తమిళ నాడులోని వివిధ ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను సైతం ట్విట్టర్, ఫేస్బుక్ ఎకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. వీరితోపాటు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం చెన్నైలో వరదల కారణంగా ప్రజల దారుణ పరిస్థితి గురించి ట్విట్టర్లో స్పందించారు. 'శ్రీమంతుడు' సాయం 10 లక్షలు.. వరదల తాకిడికి గురై చెన్నై, పరిసన ప్రాంతాల్లోని జనజీవనం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు మహేష్‌బాబు తనవంతు సాయంగా పదిలక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించారు. త్వరలోనే తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ విరాళాన్ని అందజేయనున్నారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ,'భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సాయంగా పది లక్షల రూపాయల్ని అందిస్తున్నాను' అని చెప్పారు. బాధితులకు అండగా నందమూరి బ్రదర్స్.. తుఫాను కారణంగా చెన్నై నగరంలో చోటు చేసుకున్న ప్రకృతి విళయ తాండవాన్ని చూసి చలించిన నందమూరి సోదరులు కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ స్పందించారు. తమ వంతుగా సహాయంగా ఎన్టీఆర్ పదిలక్షలు, కళ్యాణ్ రామ్ ఐదు లక్షల రూపాయలను తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం గా ప్రకటించారు. 'చెన్నైతో మాకున్న అనుబంధం మరువలేనిది. అటువంటి మహానగరం పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండాల్సిన తరుణమిది. చెన్నై ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ నేపథ్యంలో సహాయం అందించగలిగిన ప్రతి ఒక్కరు స్పందించమని విజ్ఞప్తి చేస్తున్నాం' అని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెలిపారు. రవితేజ ఔదార్యం.. గత కొన్ని రోజులుగా విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నై జన జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఆర్తులకు చేయూతగా రవితేజ సైతం 5 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని అందజేయనున్నారు. 25 లక్షలతో బన్నీ చేయూత.. చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు అల్లుఅర్జున్ 25 లక్షల రూపాయల్ని సాయంగా ప్రకటించారు. 'చెన్నై వరదలు ప్రళయానికి ప్రతీకగా ఉన్నాయి. 18 సంవత్సరాలు నేను చెన్నైలో పెరిగాను. నేనేంటో అందరికీ తెలిసేలా చేసింది కూడా చెన్నైనే.. అటువంటి చెన్నైలో నేటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అతిత్వరలోనే చెన్నై, చెన్నై ప్రజలు కోలుకోవాలని ఆశిస్తున్నాను' అని అల్లుఅర్జున్ చెప్పారు. వరుణ్‌తేజ్ సైతం.. ప్రస్తుతం చెన్నైలోని పరిస్థితులకు స్పందిస్తూ యువనటుడు వరుణ్‌తేజ్ సైతం తనవంతు సాయంగా 3 లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించారు. 'నేను చెన్నైలోనే పుట్టాను. అటువంటి చెన్నై నేడు ఇలా వరద నీట మునగటం నన్నెంతగానో కలిచివేసింది' అని వరుణ్‌తేజ్ తెలిపారు. వీరి బాటలోనే '3జి లవ్' సినిమాను నిర్మించిన నిర్మాత ప్రతాప్ కోలగట్ల చెన్నై వరద బాధితులకు సహాయంగా లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఎపిలో హుదూద్ తుఫాన్ సంభవించినప్పుడు తమిళ హీరోలు సూర్య, విశాల్ వంటి వారు లక్షల్లో విరాళం ఇచ్చి స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడు అలాంటి విపత్తే చెన్నైని తాకింది' అని అన్నారు. మరో నటుడు సంపూర్నేష్‌బాబు బాధితులకు సహాయంగా 50వేల రూపాయల్ని విరాళంగా అందించగా, యువనటుడు సందీప్‌కిషన్ 5 వేల ఆహార పొట్లాలను బాధితుల సహాయార్థం చెన్నైకు పంపించారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







