బోటులో పెళ్లి బృందం...40 అడుగుల లోతులో బోటు...
- May 16, 2018
దాదాపు 15గంటలు పూర్తి కావొస్తోంది. ఇంత వరకు ఒక్కరి ఆచూకీ కూడా లేదు. తమ వారు ఉన్నారా? చనిపోయారా? బోటు కింద మునిగి జలసమాధి అయ్యారా? తెలియదు. అసలు బతికున్నారా? లేదా అంటూ బాధితుల బంధువులు విషాదంలో మునిగిపోయారు. గోదావరి నదిలో లాంచీ బోల్తా పడిన ఘటనపై ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడ్డుకి కొంచెం దూరంలోనే బోటు మునిగిపోయిందని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు.. దాన్ని పైకి లేపి ఒడ్డుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
నీటి అడుగున సుమారు 40 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దాన్ని బయటకు తీసేందుకు పోలవరం నుంచి రెండు భారీ క్రేన్లు తెప్పిస్తున్నారు. మరోవైపు అందులో ఉన్నవారి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో చిన్న చిన్న బోట్లతో గోదావరిలో ముమ్మర గాలింపు జరుపుతున్నారు. మరోవైపు నేవీ హెలికాప్టర్లు, నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయకచర్యల్లో నిమగ్నమయ్యాయి.
లాంచీ బోల్తా ప్రమాదంతో కొండమొదలు, గొందూరు, తల్లోరు, మంటూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బోటులో ఉన్నవారంతా ఈ గ్రామాల వారే. బోటులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో లాంచీ బోల్తా పడగానే 16 మంది ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చేశారు. మిగిలిన 36 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. అందులో పెళ్లి బృందం కూడా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో తమ వారి ఆచూకీ కోసం గ్రామాల్లో ప్రజలు భారీగా ఘటన స్థలానికి తరలివస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని వారంతా విషాదంలో మునిగిపోయారు.
మంటూరు లాంచీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గాలింపు చర్యలు, సహాయక చర్యల మీద ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటున్నారు. మరికాసేపట్లో సీఎం చంద్రబాబు ఘటన స్థలానికి బయలుదేరనున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







