రాష్ట్రంలో మద్యం కల్తీ మహమ్మారి..
- December 08, 2015
రాష్ట్రంలో మద్యం కల్తీ మహమ్మారి.. ఇందుగలడు అందు లేడు అన్న రీతిలో... ప్రతి చోటా వ్యాపించి ఉంది. కర్నూలు నుంచి సిక్కోలు దాకా మద్యం కల్తీ దందా సాగుతోంది. పగలంతా పడ్డ కష్టాన్ని మరిచేందుకు.. లేదా కాస్తంత ఉపశమనం పొందేందుకు కిక్కును ఆశ్రయిస్తున్నాడు. దీన్నే మద్యం వ్యాపారులు అవకాశంగా తీసుకుంటున్నారు. సామాన్యుడి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రెండు విధానాలుగా మద్యం కల్తీ.......... రాష్ట్రంలో మద్యం కల్తీ రెండు విధానాలుగా జరుగుతోంది. బ్రాండెడ్ మద్యం బాటిల్ మూతను.. చాకచక్యంగా ప్రత్యేక యంత్రం ద్వారా తీసి.. అందులోని పాతిక శాతం మద్యాన్ని తీసుకొని.. ఖాళీ అయిన బాటిల్లో ఆమేర స్పిరిట్‌ను నింపుతున్నారు. మద్యం ప్రియులకు అనుమానం రాకుండా బాటిల్ లేబుల్‌ను, మూతను డబ్లుకం సాయంతో అమర్చుతున్నారు. మద్యం కల్తీకి మహారాష్ట్ర, పుణె, బీహార్లలో దొరికే స్పిరిట్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం. మందుబాబులు గుర్తించలేని రీతిలో మద్యంలో స్పిరిట్ కల్తీ............... బీహార్ తదితర రాష్ట్రాల నుంచి తెచ్చే స్పిరిట్‌ను మద్యంలో కలిపినా.. మందు బాబులు ఏమాత్రం గుర్తించలేరని సమాచారం. అందుకే ఈ స్పిరిట్నుపెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. మద్యాన్ని కల్తీ చేసేందుకు స్పెషలిస్టులూ ఉన్నారు. మద్యం వ్యాపారులు ఇలాంటి నిపుణులను పెద్ద మొత్తాలు చెల్లించి.. నియమించుకుంటున్నారు. స్పిరిట్ కలిపిన మద్యాన్ని రెండు రోజుల్లోగా వినియోగించక పోతే.. దాని అసలు స్వరూపం బయటపడుతుందట. అందుకే.. కల్తీ చేసిన రెండు రోజుల్లోపే మద్యాన్ని వినియోగదారులకు అంటగట్టేస్తున్నారు. కల్తీ మద్యం సేవించడం వల్ల తలనొప్పి.... స్పిరిట్ కలిపిన మద్యాన్ని సేవించడం వల్ల.. మందుబాబులకు తలనొప్పి, వాంతులు, శరీరం వేడెక్కడం, కాళ్లు లాగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురవుతారు. ఇప్పుడు కృష్ణలంకలో చోటు చేసుకున్న విషాదంలోనూ.. మందుబాబులు ఇలాంటి లక్షణాలతోనే ఆస్పత్రి పాలయ్యారు. కల్తీ మద్యం దందాలో పాలక పక్షపు ప్రముఖులు ? రాష్ట్రంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నది బహిరంగ రహస్యం. చాలా చోట్ల మంత్రులు, పాలక పక్షపు ప్రముఖులు.. ఈ దందాకు దన్నుగా నిలుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆమధ్యన.. కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ శాఖ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో.. సాక్షాత్తు ఆ జిల్లా పరిషత్ చైర్మన్.. కల్తీ మద్యం దందాను ప్రోత్సహిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు. కల్తీ మాఫియాగా మారిన మద్యం వ్యాపారులు ప్రముఖులు దన్ను లేని జిల్లాల్లో మద్యం వ్యాపారులే.. కల్తీ మాఫియాగా రూపాంతరం చెందారు. మద్యం కల్తీ నేరానికి కఠినమైన శిక్షలు లేకపోవడంతో.. వీరు ఈ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరం ఘటన అనంతరం.. పోలీసులు పీచెట్టి రామకృష్ణ అనే వ్యాపారిపై పీడీ యాక్టు కింద అరెస్టు చేశారు. అయితే.. కొంత కాలానికే అతను.. కోర్టు వేసిన జరిమానాను చెల్లించి దర్జాగా బయటికి వచ్చి దొరలా తిరిగాడు. దీన్ని బట్టి మద్యం కల్తీకి శిక్షలు ఏమాత్రమున్నాయో ఇట్టే అర్థమవుతుంది. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సారా దుకాణాలు మద్యం వ్యాపారం నిర్వహించటానికి దాని నుండి ఆదాయం పెంచుకోవటానికి ప్రభుత్వం అనుసరించిన విధానమే కల్తీ మద్యం మరణాలకు ముఖ్య కారణమన్నది నిపుణుల వాదన. గతంలో ప్రభుత్వమే సారా దుకాణాలను నిర్వహించేది. 1990 తర్వాత వేలం ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించడం ప్రారంభమైంది. వేలం పాటల్లో సారాషాపులను దక్కించుకోవటానికి, వ్యాపారులు ప్రత్యర్ధి వర్గాలతో రాజీబేరాలు సాగించటం, దారికి రాకుంటే బెదిరింపులకు, ఆఖరికి హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఈ విధంగా మద్యం మాఫియా తమ రాజ్యాలను ఏర్పాటు చేసుకొంటూ వస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తుతున్న వ్యాపారులు అన్ని రకాల ఎత్తులూ వేసి.. మద్యం దుకాణాలను పొందిన వ్యాపారులు.. అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తేందుకు.. మద్యం కల్తీనీ ఒక సాధనంగా వాడుకుంటున్నారు. మిథనాల్ తో పాటు.. అలాంటి స్పిరిట్లను మోతాదుకు మించి మద్యంలో కలుపుతూ.. సామాన్యుడి జీవితాల్లో మరణశాసనం లిఖిస్తున్నారు. తరచూ తనిఖీలు అనివార్యం మద్యం కల్తీని నిరోధించే బాధ్యతను ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించక పోవడం వల్లే.. ఏటా కల్తీ మద్యం మరణాలు సంభిస్తున్నాయి. తరచూ మద్యం దుకాణాలు, బార్లలో తనిఖీలు నిర్వహించడం.. కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా.. కఠినంగా వ్యవహరించడం చేయాలి. దీంతో పాటే.. రాష్ట్ర సరిహద్దుల వద్దనున్న చెక్‌పోస్టులలో అన్ని వాహనాలనూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. స్పిరిట్, నల్లబెల్లం లాంటి పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించాలి. ఇవన్నీ చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. అధికారుల్లో అంతకు మించిన అంకిత భావం ఉండాలి.
తాజా వార్తలు
- మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!









