యు.ఏ.ఈ లో ఏ.పి బాధితులను రక్షించిన సోషల్ మీడియా!
- June 03, 2018
విశాఖపట్నం:దుబాయ్‌లో ఉద్యోగాల కోసమని వెళ్లి నరకయాతన అనుభవించిన ఉత్తరాంధ్రకు చెందిన 22మంది బాధితులు నగర పోలీసుల చొరవతో సురక్షితంగా నగరానికి చేరుకున్నారు. ప్రత్యేకించి.. వీరిని సోషల్ మీడియానే రక్షించిందని చెప్పవచ్చు. అక్కడ బందీలుగా మారిన బాధితులు.. ట్విట్టర్లో విశాఖ సీపీ యోగానంద్‌కు మొరపెట్టుకోగా ఆయన స్పందించడంతో కథ సుఖాంతమైంది. ఈ సందర్భంగా బాధితులు శనివారం సీపీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం.. గల్ఫ్‌లో 2నెలలపాటు తాము అనుభవించిన బాధలను వారు మీడియాకు వివరించారు.
దుబాయ్, అబుదాబిలో వెల్డర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన 22మంది నుంచి గాజువాకలోని వెస్కో రోబోటెక్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు ఎల్డీ ప్రసాద్ ఒక్కొక్కరి వద్ద రూ.65వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేశాడు. హ్యుందాయ్ కంపెనీలో ఉద్యోగమంటూ విజిటింగ్ వీసాపై ఏప్రిల్‌లో వారిని అక్కడికి పంపాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత హోరిజోన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్స్ ప్రతినిధులు వారిని తీసుకెళ్లి నిర్మాణ పనుల్లో కూలీలుగా పెట్టారు. ఈ పనిచేయలేమని, తిరిగి వెళ్లిపోతామంటే కేసులు పెడతామని బెదిరించి గదుల్లోనే బంధించారు. తినడానికి కూడా డబ్బుల్లేకపోవడంతో సోషల్ మీడియాలో మొరపెట్టుకోగా.. అమెరికాలో ఉంటున్న శ్రీకాకుళం జిల్లా లావేరుకు చెందిన కేవీ రెడ్డి వంద డాలర్లు, కువైట్‌లో ఉంటున్న మురళీధర్‌రెడ్డి మరికొంత సాయం అందించారు. చివరకు విశాఖ సీపీ యోగానంద్‌కు ట్విట్టర్లో తమ గోడు వివరించగా ఆయన గాజువాక ఏజెంట్‌ను ముంబై పంపించి అక్కడి నుంచి గల్ఫ్‌లోని ఏజెంట్‌తో మాట్లాడించి వారిని ఇండియాకు తీసుకువచ్చేలా కృషి చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గల్ఫ్‌లో అధిక వేతనాలకు ఆశపడి చాలామంది అప్పు చేసిమరీ ఏజెంట్లకు డబ్బులు కట్టేస్తున్నారన్నారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత వేరే పనులు చేయించడం, వసతి కల్పించకపోవడం, పనిచేసినా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం వంటివి చేస్తుంటారన్నారు. తిరిగి స్వదేశానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి నిర్ధారించుకున్న తర్వాతే వెళ్లడం మంచిదని సూచించారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







