బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల

బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల

బగ్గిడి ఆర్ట్‌ మూవీస్‌ పతాకంపై దర్శకుడు అర్జున్‌ కుమార్‌ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్‌. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బగ్గిడి గోపాల్‌ టైటిల్‌ రోల్‌ లో నటిస్తుండగా.ఇతర కీలక పాత్రలను సుమన్‌, కవిత, గీతాంజలి, రమాకాంత్‌, చందన, తేజా రెడ్డి, అమిత్‌ కపూర్‌ పోషిస్తున్నారు. జయసూర్య సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కె రోశయ్య, ఏపీసీసీ ప్రెసిడెంట్‌ రఘువీరారెడ్డి, నటి జమున, మాజీ మంత్రి మారెప్ప తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆడియో సీడీని రోశయ్య విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అందజేశారు. సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిత్ర నిర్మాత, నటుడు బగ్గిడి గోపాల్‌ మాట్లాడుతూ..నేను అంబేద్కర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూను కాదు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. నా బయోపిక్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు.

కానీ నా జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలి. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను కండక్టర్‌ స్థాయి నుంచి శాసనసభ్యుడిగా ఎదిగాను. డబ్బు కోసం రాజీపడకుండా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశాను. నన్ను ఎన్నుకున్న ప్రజల పక్షాన నిలబడ్డాను.

రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నాను. ఇవి నచ్చని దుష్టశక్తులు కొన్ని నన్ను అణిచివేయాలని ప్రయత్నించాయి. వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డాను. ఇవాళ అనేక విద్యాసంస్థలు నెలకొల్పి ఎందరో విద్యార్థులకు చదువు అందిస్తున్నాను.

నా జీవితాన్ని కథగా రాస్తే ఎవరూ చదవరు. అందుకే రంగుల ప్రపంచమైన సినిమా ద్వారా ఇదంతా చెప్పాలనుకున్నాను. నేను ఎవరినీ మోసం చేయలేదని చెప్పాలనే నా 35 ఏళ్ల మనోవేధనకు ప్రతిరూపమే ఈ బగ్గిడి గోపాల్‌ చిత్రం. నేను రేపు ఉన్నా లేకున్నా సినిమా చిరకాలం ఉండిపోతుంది.

అన్నారు. దర్శకుడు అర్జున్‌ కుమార్‌ మాట్లాడుతూ.బగ్గిడి గోపాల్‌ గారి జీవితంలో సినిమాకు కావాల్సినన్ని మలుపులు ఉన్నాయి. ఆయన కథ విన్నాక.ఇది తప్పకుండా సినిమాగా రూపొందించాలని అనుకున్నాను. బయోపిక్‌ అయినా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని వాణిజ్య అంశాలను చేర్చి సినిమాగా రూపొందించాము.

ఈ చిత్రంలో నేనొక కీలక పాత్ర పోషించాను. నా అభిమాన నటుడు సుమన్‌ గారిని డైరెక్ట్‌ చేయడం మర్చిపోలేని విషయం. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు చీత్రాన్ని తీసుకొచ్చేం దుకు సన్నాహాలు చేస్తున్నాం.

అన్నారు.ఈ కార్యక్ర మంలో అతిథులుగా పాల్గొన్న రఘువీరారెడ్డి, జమున, మారెప్ప తదితరులు చిత్ర బృందానికి మంచి విజయం దక్కాలని ఆకాంక్షించారు.

Back to Top