ఆసియా కప్‌ టీ20: ఫైనల్లో భారత్‌ మహిళల జట్టు

- June 08, 2018 , by Maagulf
ఆసియా కప్‌ టీ20: ఫైనల్లో భారత్‌ మహిళల జట్టు

కౌలాలంపూర్‌: ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన హర్మన్‌ప్రీత్‌ గ్యాంగ్‌ తుది పోరుకు అర్హత సాధించింది. పాకిస్తాన్‌ నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 16.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఈ టోర్నీలో నాల్గో విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత్‌ సగర్వంగా ఫైనల్‌కు చేరింది. అంతకముందు మలేసియా, థాయ్‌లాండ్‌, శ్రీలంక జట్లపై భారత్‌ విజయాల్ని సాధించిన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భాగంగా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మిథాలీ రాజ్‌ డకౌట్‌ నిష్క్రమించడంతో భారత్‌ పరుగుకే వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత దీప్తి శర్మ(0) సైతం పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ బాటపట్టింది. కాగా,స్మృతీ మంధాన(38), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(34 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్‌ ఇంకా 23 బంతులుండగానే విజయం సాధించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 72 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్‌ క్రీడాకారిణుల్లో సనా మిర్‌(20 నాటౌట్‌), నహిదా ఖాన్‌(18)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా, మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్‌ ఏక్తా బిస్త్‌ మూడు వికెట్లతో రాణించగా, శిఖా పాండే, అంజూ  పటేల్‌, పూనమ్‌ యాదవ్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com