ఢిల్లీ వెళుతున్న సీఎం కేసీఆర్..

- June 13, 2018 , by Maagulf
ఢిల్లీ వెళుతున్న సీఎం కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. రేపు ప్రధానితో సమావేశమవుతారు. చాలా రోజుల తరువాత మోడీని కలవనున్న కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. కొత్త జోనల్ విధానానికి ఆమోదం, ముస్లిం రిజర్వేషన్ పెంపు సహా పలు అంశాలపై మోడీతో మాట్లాడనున్నారు. నాలుగేళ్లలో రాష్ట్ర పురోగతిని ప్రధానికి వివరించి సాగునీటి ప్రాజెక్ట్‌లకు కేంద్ర సాయం కోరనున్నారు కేసీఆర్.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎట్టకేలకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నాం 12-30 నిమిషాలకు ప్రధానితో  కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇందుకోసం ఒక రోజు ముందుగానే  కేసిఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కేంద్ర హోంశాఖమంత్రి రాజ్ నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు.  ప్రధానిని కలిసేందుకు యత్నించినా.. ఆయన విదేశీ పర్యటన బిజీలో ఉండటంతో అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో టూర్‌ను అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ వచ్చేశారు తెలంగాణ సీఎం. అయితే పీఎంవో నుంచి పిలుపు రావడంతో మళ్లీ హస్తినకు వెళుతున్నారు కేసీఆర్.  

విభజన హామీల అమలు, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రధానితో  కేసీఆర్ చర్చించనున్నారు.  హైకోర్టు విభ‌జ‌నను త్వరగా పూర్తిచేయాలని కోరనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న  జోనల్ సిస్టమ్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించేలా చూడాలని  విన్నవించనున్నారు. గ‌తంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై అఖిలప‌క్షంతో  ప్రధానిని క‌లిసేందుకు ప్రయ‌త్నించారు సీఎం. అయితే అది సాధ్యపడలేదు. దీంతో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశంపై కూడా ప్రధానితో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. 

ఇక రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రధానికి వివరించనున్నారు కేసీఆర్. శరవేగంగా సాగుతున్న తాగు, సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన నీతిఆయోగ్.. మిషన్ భగీరథకు 8 వేల కోట్లు రూపాయల ఇవ్వాలని కేంద్రానికి సిఫారస్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు రావడంతో కేంద్ర నిధులు కోరనున్నారు కేసీఆర్. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాల అమలును మోడీకి వివరించనున్నారు ముఖ్యమంత్రి. కేంద్రం తీసుకున్న డిమానిటైజేష‌న్, జీఎస్టీతో ఎద‌ురవుతున్న  ఇబ్బందులను ప్రధానికి తెల‌పనున్నారు. జీఎస్టీ పరిధి నుంచి  కొన్ని మిన‌హాయింపులు కోర‌నున్నారు సీఎం. 

మొత్తానికి చాలాకాలం తర్వాత ప్రధానితో  కేసీఆర్ సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆదివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి మాత్రం కేసిఆర్ హాజ‌రుకావ‌డం లేదు.  ప్రధానితో సమావేశం అనంత‌రం తిరిగి  ఆయన హైద‌రాబాద్ రానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com