సౌదీ అరేబియా లో సెన్సేషనల్ సీరియల్

- June 16, 2018 , by Maagulf
సౌదీ అరేబియా లో సెన్సేషనల్ సీరియల్

సౌదీ అరేబియాలో ఓ టీవీ సీరియల్ సంచలనం రేపుతోంది. ఈ సీరియల్ పై అక్కడి ఛాందసవాదులు మండిపడుతున్నారు. సంప్రదాయాలను మంటగలిపి సమాజంలో అనైతిక ధోరణులు వ్యాప్తి చేస్తున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలా అని అదేం పెద్దలకు మాత్రమే తరహా డ్రామా కాదు. 1970లలో సౌదీ అరేబియాలో మనుషులు, వారి మమతలను వివరించే చక్కని కుటుంబ కథ. కానీ అందులో పాత్రలు ఇప్పటి తరహాలో నిండా ముసుగులు కప్పుకొని ఉండరు. అదే ఇప్పుడు వివాదం రాజేస్తోంది.

అల్-అసోఫ్ (ఇంటి బెంగ).. సౌదీ అరేబియాలో సంచలం సృష్టిస్తున్న మెగా డెయిలీ సీరియల్. అబూ దాబీలో చిత్రీకరణ జరుపుకున్న ఈ ధారావాహిక 1970ల నాటి సౌదీ సమాజానికి అద్దం పడుతోంది. ముసుగులు ధరించని మహిళలు, సంగీత నృత్యాలు, ఆడమగ కలిసి తిరగడం, శారీరక ఆకర్షణలు వంటి మసాలాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇది చూసిన స్వేచ్ఛావాదులు అప్పట్లో ఎలా ఉండేవారు? మళ్లీ ఆ రోజులు రాబోతున్నాయని ఆనందపడుతున్నారు.

ఇటీవల సింహాసనం ఎక్కిన ప్రిన్స్ మొహమ్మద్ దేశంలో అనేక సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా సాంస్కృతికంగా విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తీసుకురాక మునుపటి రోజుల్లోకి దేశాన్ని నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. అల్-అసోఫ్ ఇందుకు తగ్గట్టుగా ఉండటం విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది.

అయితే ఇన్నాళ్లూ రాజ్యాన్ని తమ కనుసన్నలలో నడిపిన మతపెద్దలు, ఛాందసవాదులకు మాత్రం ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అల్-అసౌఫ్ ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. సమాజంలో నైతిక విలువలను పతావస్థకు చేరుస్తున్నారని మండిపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com