ఏడుస్తూ కూర్చున్న 26 మంది బాలికలు..

- July 06, 2018 , by Maagulf
ఏడుస్తూ కూర్చున్న 26 మంది బాలికలు..

మారుతున్న టెక్నాలజీ మంచికీ ఉపయోగపడుతుంది.. చెడుకీ ఉపయోగపడుతుంది. అన్యాయాలు, అక్రమాలు పెచ్చుమీరి పోతున్నాయని ఆందోళన చెందినా అక్కడక్కడా జరిగే ఇలాంటి సంఘటనలు వెలుగుచూసినప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం ఎంతమంచిదైంది అని అనిపించకమానదు. అతడు చేసిన ఈ పని ద్వారా 26 మంది అమాయక బాలికల జీవితాలు చీకటి మయం కాకుండా చేసింది. 

జులై 5 ముజఫర్‌నగర్-బాంద్రా అవధ్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్ కోచ్‌‌లో ప్రయాణిస్తున్నాడు ఆదర్శ్ శ్రీవాత్సవ అనే ప్యాసింజర్. రైలు ఎక్కగానే ఏదో బుక్ తీసి చదువుకుంటున్నా ఎక్కట్లేదు. కారణం అదే బోగీలో ప్రయాణిస్తున్న బాలికలు ఏడుస్తూ కనిపించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు లెక్కపెడితే ఏకంగా 26 మంది ఉన్నారు. అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వారిమీద అజమాయిషీ చెలాయిస్తున్న 55 వయస్సున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఆదర్శ్‌కి ఎందుకో అనుమానం వచ్చింది. ఇది కిడ్నాప్ వ్యవహారమేమోనని బలంగా అనిపించింది. తన అనుమానాన్ని ఏమాత్రం పైకి కనిపించనివ్వకుండా చేతిలో ఉన్న ఫోన్ ద్వారా తను చూస్తున్న బాలికల పరిస్థితిని గురించి క్లుప్తంగా వివరిస్తూ, దయచేసి వెంటనే స్పందించండి అని రైల్వే మంత్రిత్వ శాఖకు ట్వీట్ చేశాడు. 

ఆదర్శ్ ట్వీట్‌తో వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సాధారణ దుస్తులు ధరించిన ఇద్దరు జవాన్లు 26 మంది బాలికలు ఉన్న బోగీలో ఎక్కారు. వారితో పాటు మరో ఇద్దరు పెద్ద వయసు ఉన్న వారిని గుర్తించారు. ఇద్దరు జవాన్లు వారితో కొంతసేపు ముచ్చటించి సమాచారాన్ని రాబట్టారు. నర్కటిక్యాగంజ్ నుంచి ఇద్ఘా ప్రాంతానికి బాలికలను తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. రైలు ఆగిన స్టేషన్లోనే బాలికలందరినీ దించేసి ముఖ్యపాత్రధారులైన ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. 

ట్వీట్ చేసిన ఆదర్శ్‌ని రైల్వే పోలీసులు అభినందించారు. బాలికలంతా తమ జీవితాలు బుగ్గిపాలు కాకుండా కాపాడినందుకు ఆదర్శ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతానికి బాలికలందరినీ శిశు సంక్షేమ గ‌ృహానికి తరలించారు రైల్వే పోలీసులు. బాలికలు ఇచ్చిన సమాచారం మేరకు వారి కుటుంబసభ్యులకు అప్పజెప్పనున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త ఆదర్శ్‌కి నెటిజన్స్ నుంచి ప్రశంశలు అందుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com