రాణిని అవమానించిన ట్రంప్

- July 14, 2018 , by Maagulf
రాణిని అవమానించిన ట్రంప్

ప్రొటోకాల్ పక్కనపెట్టి.. రాణి కంటే ముందు నడిచి బ్రిటన్‌లో ఇబ్బందికరంగా ట్రంప్‌ వ్యవహారశైలి లండన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రిటన్‌ వాసుల ఆగ్రహంలో మరింత ఆజ్యం పోశారు. ట్రంప్‌ ప్రస్తుతం బ్రిటన్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ట్రంప్‌కు వ్యతిరేకంగా చాలా మంది ఆందోళన చేస్తున్నారు. ట్రంప్‌తో రాణి ఎలిజెబెత్‌ భేటీని అత్యధిక మంది బ్రిటన్‌ వాసులు వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్‌, క్వీన్‌ ఎలిజెబెత్‌-2లు శుక్రవారం తొలిసారిగా సమావేశమయ్యారు. రాజవంశానికి చెందిన విండ్సర్‌ క్యాసిల్‌ కోటలో నిర్వహించిన తేనీటి విందులో ట్రంప్‌ పాల్గొన్నారు. అయితే ట్రంప్‌ రాణిని కలవగానే కేవలం షేక్‌హ్యాండ్‌ మాత్రమే ఇచ్చారు. ఆమె ఎదుట గౌరవ పూర్వకంగా తలను వంచలేదు. ప్రొటోకాల్‌ ప్రకారం రాణి ఎదుట తల వంచాలి. ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ కూడా తలను వంచలేదు. అంతేకాకుండా ట్రంప్‌ విండ్సర్‌ క్యాసిల్‌కు నిర్ణీత సమయానికి రాలేదు.

దాదాపు 12 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీంతో అంతసేపు 92ఏళ్ల ఎలిజెబెత్‌ వారిని ఆహ్వానించేందుకు విండ్సర్‌ క్యాసిల్‌ వెలుపల వేచి ఉండాల్సి వచ్చింది. ట్రంప్ విండ్సర్‌ క్యాసిల్‌లో సైనికుల గౌరవ వందనం స్వీకరించే సమయంలోనూ రాణి పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారు. ఆమె కంటే ముందు నడవడమే కాకుండా ఆమెకు దారి ఇవ్వకుండా అటు ఇటూ నడిచారు.

దీంతో రాణి కూడా తడబడ్డారు. ప్రొటోకాల్‌ ప్రకారం రాణికి ముందుగా నడవకూడదు. కానీ ట్రంప్‌ మాత్రం ఆ నిబంధనను ఏమాత్రం పట్టించుకోకుండా చక్కగా ముందు నడుచుకుంటూ వచ్చేశారు. బ్రిటన్‌ వాసులు ఎంతో గౌరవించే మహారాణి పట్ల ట్రంప్‌ ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై అక్కడి ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్‌ను తిడుతూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. స్కాట్లాండ్‌కు చేరుకున్న ట్రంప్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన అనంతరం స్కాంట్లాండ్‌కు వెళ్లారు. అక్కడ కూడా వేలాది మంది ప్రజలు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనల నడుమే ఆయన ఆ దేశంలో అడుగుపెట్టారు.

ఇది ట్రంప్‌ వ్యక్తిగత పర్యటన. ట్రంప్‌ తల్లి స్కాట్లాండ్‌కు చెందిన వ్యక్తి. ఈ వారాంతాన్ని ఆయన ఐర్‌షైర్‌లోని తన టర్న్‌బెర్రీ గోల్ఫ్‌ రిసార్ట్‌లో గడపనున్నారు. అయితే ట్రంప్ స్కాట్లాండ్‌కు రావడంపై గ్లాస్గోలో ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com